నేవీ అమ్ములపొదిలో ‘అస్త్రధరిణి’ | 95 per cent of the indigenous knowledge | Sakshi
Sakshi News home page

నేవీ అమ్ములపొదిలో ‘అస్త్రధరిణి’

Oct 7 2015 12:24 AM | Updated on Sep 3 2017 10:32 AM

నేవీ అమ్ములపొదిలో ‘అస్త్రధరిణి’

నేవీ అమ్ములపొదిలో ‘అస్త్రధరిణి’

టొర్పొడోలను ప్రయోగించే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్‌ఎస్ అస్త్రధరిణి నౌక భారత నావికా దళంలో చేరింది.

విశాఖపట్నం: టొర్పొడోలను ప్రయోగించే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఐఎన్‌ఎస్ అస్త్రధరిణి నౌక  భారత నావికా దళంలో చేరింది.  ప్రయోగించిన టొర్పొడోలను తిరిగి రికవరి చేయగల సామర్థ్యం కలిగిన అస్త్రధరిణిని తూర్పు నావికా దళ చీఫ్ రియర్ అడ్మిరల్ సతీష్‌సోనీ విశాఖపట్నం నేవల్ బేస్‌లో జరి గిన కార్యక్రమంలో మంగళవారం ప్రారంభించి జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానంతో మరో యుద్ధనౌకను నిర్మించుకుని ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడించుకున్నామని, సముద్ర  గర్భం లోనూ ప్రయోగించే విషయంలో  మరో ముందడుగు వేశామని చెప్పారు.

 95 శాతం స్వదేశీ పరిజ్ఞానం
 ఎన్‌ఎస్‌టీఎల్, షిప్‌యార్డ్‌లతో పాటు ఐఐటి ఖరగ్‌పూర్ సంయుక్తంగా ఈ నౌక నిర్మాణ డిజైన్‌ను రూపొందించారు. 50 మీటర్ల పొడవుతో 15 నాటికన్ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ నౌక ట్రయల్స్‌లో భాగంగానే పలు విధ్వంసకర టొర్పొడోలను ప్రయోగించి శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంది. అధునాతన శక్తి వినియోగ విధానాన్ని అనుసంధానించుకుంటూ నావిగేషన్, సమాచార వ్యవస్థ పటిష్టతను కలిగిఉంది. మేకిన్ ఇండియా నినాదంతో 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంది. 2015 జూలై 17న సేవలనుంచి విరమించిన అస్త్రవాహినికి అధునాతన సాంకేతిత జోడించి నిర్మాణమైన నౌక అస్త్రధరిణి కావడం విశేషం.

ఇద్దరు అధికారులు, 27మంది నావికులతో పాటు డీఆర్‌డీఓకు చెందిన 13 మంది సైంటిస్ట్‌లు ఈనౌకకు సేవలందించనున్నారు. ఈ నౌకను జలప్రవేశం చేయించేందుకు విచ్చేసిన ఈఎన్‌సీ చీఫ్ సతీష్‌సోనికి ఏపీ నావల్ ఆఫీసర్ ఇన్‌చార్జి కమాండర్ కె.ఎ. బొప్పన్న నావల్ జెట్టి వద్ద గౌరవ వందనంతో స్వాగతం పలికారు. కమాండింగ్ అధికారి దీపక్ సింగ్ బిస్త్‌కు జాతీయగీతాలాపనతో  అస్త్రధరిణి నౌక పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ డీజీ  డాక్టర్ వి.భుజంగరావు, ఎన్‌ఎస్‌టిఎల్ డైరక్టర్ సి.డి.మల్లేశ్వరరావు, గుజరాత్ రాష్ట్ర బరూచ్‌లోని షాఫ్ట్ షిప్‌యార్డ్ ప్రయివేట్ లిమిటెడ్ సీఎండీ సహాయ్‌రాజ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement