ఇంటి నుంచి వెళ్లి.. అడవిలో శవమై..

Young Man Murder In Jayapura - Sakshi

జయపురం: తొమ్మిది రోజుల నుంచి కనిపించకుండా పోయిన ఓ యువకుడు అడవిలో శవమై కనిపించాడు. అడవిలో కంపు కొడుతున్న యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొని ఆ యువకుడిని ఝోరిగాం సమితిలోని చికిలి గ్రామం గౌఢ వీధికి చెందిన అభిజిత్‌ మండల్‌(29)గా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 9 వ తేదీన  ఝోరిగాంలో  కాంగ్రెస్‌ పార్టీ  మోటార్‌ బైక్‌ ర్యాలీ  నిర్వహించింది. కాంగ్రెస్‌ కార్యకర్త అయిన అభిజిత్‌ ఆ ర్యాలీలో పాల్గొంటానని  ఇంట్లో చెప్పి మోటారుబైక్‌పై  బయలు దేరాడు. ఆ రోజు నుంచి ఇంటికి రాలేదు. ఎవరికీ కనిపించలేదు. తల్లిదండ్రులు, బంధువులు  అన్ని ప్రాంతాలలో వెదికి నిరాశ చెంది 10 వ తేదీన ఝోరిగాం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు అభిజిత్‌ను ఎవరో హత్య చేశారని మృతుడి తండ్రి అతుల్‌ మండల్‌ ఫిర్యాదులో ఆరోపించారు.  ఫిర్యాదు మేరకు   ఝోరిగాం పోలీస్‌స్టేషన్‌ అధికారి ప్రమోద్‌ కుమార్‌ నాయక్‌ తన సిబ్బందితో దర్యాప్తు ప్రారంభించారు.

అయితే  ఝెరిగాం సమీప కుసుమపాణి అడవిలోయువకుడి మృతదేహం పడి ఉండడం,  దగ్గరలో ఉన్న మోటారుబైక్‌ను చూసిన వారు పోలీసులకు తెలపడంతో వెళ్లి అడవిలో ఉన్న యువకుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అత్యంత శోచనీయ స్థితిలో మరణించి ఉన్న యువకుడిని హత్య చేశారని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అనుమానించారు.  పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడి మృతదేహానికి 200 మీటర్ల దూరంలో మోటార్‌బైక్‌ పడి ఉంది. అభిజిత్‌ మండల్‌ తల్లిదండ్రులు వచ్చి తమ కుమారుడిని గుర్తించారు. అభిజిత్‌ మండల్‌ను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారన్న దానిపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఈ హత్యకు రాజకీయ శత్రుత్వమే కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top