మృత్యు అలలు!

Young man Missing in Kambala Raidu Beach Srikakulam - Sakshi

కంబాలరాయుడుపేట సముద్ర తీరంలో యువకుడు గల్లంతు

వాలీబాల్‌ తీసుకొచ్చేందుకు వెళ్లి మునిగిపోయిన వైనం

రథసప్తమి వేళ విషాదం

శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు: రథసప్తమి పుణ్యస్నానాలకని వెళ్లిన యువకుడు అలల ధాటికి గల్లంతైన ఘటన మంగళవారం వజ్రపుకొత్తూరు మండలం కంబాలరాయుడుపేట సముద్రతీరంలో చోటుచేసుకుంది. స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం పూండి– గోవిందపురం గ్రామానికి చెందిన చిన్ని నర్సింహమూర్తి, లక్ష్మీలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చిన్ని కిషోర్, చిన్న కుమారుడు చిన్ని మనోజ్‌. కిషోర్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి విశాఖపట్నంలోని ఓ డిఫెన్స్‌ అకాడమీలో నేవీ ఉద్యోగం కోసం శిక్షణ పొందుతున్నాడు. ఐదు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న కిషోర్‌ మంగళవారం రథసప్తమి కావడంతో స్నేహితులతో కలిసి కంబాలరాయుడుపేట సముద్రతీరానికి వెళ్లాడు. కాసేపు సందడిగా గడిపిన కిషోర్‌ తీరంలో వాలీబాల్‌ ఆడుతుండగా బంతి సముద్రంలోకి వెళ్లింది. దానిని తీసుకొచ్చే క్రమంలో గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు గాలించినా ఫలితం లేకపోయింది. స్థానిక మత్స్యకారులు, యువకులు వల వేసి వెతికినా ఆచూకీ లభించలేదు. 

మెరైన్‌ పోలీసుల గాలింపు: ఈలోగా భావనపాడు నుంచి మెరైన్‌ సీఐ దేవుళ్లు, ఎస్‌ఐ జగదీష్, ఏఎస్‌ఐ రామచంద్రుడు సిబ్బందితో వచ్చి పరిస్థితి సమీక్షించారు. మృతదేహం లభిస్తే సమాచారం ఇవ్వాలంటూ బారువ, మంచినీళ్లపేట, దేవునల్తాడ, బావనపాడు, గుణుపల్లి, మెట్టూరు, డోకులపాడు, నువ్వలరేవు మత్సో్యకారులకు ఫోన్‌ల ద్వారా సమాచారం చేరవేశారు. రాత్రి 9 గంటల వరకు ఎక్కడా మృతదేహం లభ్యం కాలేదు. మరోవైపు వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ పి.నర్సింహమూర్తి, కాశీబుగ్గ రూరల్‌ సీఐ శేషు, సిబ్బంది మృతదేహం కోసం గాలింపు ముమ్మరం చేశారు. కిషోర్‌ తండ్రి నర్సింహమూర్తి అబుదాబిలో పనిచేస్తుండటంతో కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. దీంతో ఆయన హుటాహుటిన బయలు దేరినట్లు తెలిసింది.

విషాదంలో కుటుంబ సభ్యులు
‘అమ్మా.. చేపలకూర చక్కగా వండు.. సముద్ర స్నానం చేసి వచ్చి తింటాను’ అంటూ కిషోర్‌ చెప్పిన చివరి మాటలు తలుచుకుని తల్లి లక్ష్మీ రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడిపెట్టించింది. పెద్ద కుమారుడు త్వరలోనే సెటిల్‌ అవుతాడని తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కుమారుడికి ఉద్యోగం వస్తే విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయేందుకు తండ్రి నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే కెరటాల రూపంలో మృత్యువు కబలించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top