
మృతి చెందిన బరామాజీ
జి. కొండూరు (మైలవరం) : పెళ్లి ముచ్చట తీరకముందే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని చేగిరెడ్డిపాడు వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లికి చెందిన తేజావతు బరామాజీ (22) కి నెల రోజుల కిత్రం వివాహమైంది. ఈ క్రమంలో మంగళవారం తన ద్విచక్ర వాహనంపై గణపవరం వైపు బయలుదేరాడు. జి. కొండూరు మండల పరిధిలోని చేగిరెడ్డిపాడు గ్రామ శివారులోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న టాటా మేజిక్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిన బరామాజీ తలకు బలమైన దెబ్బ తగిలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్ పేర్కొన్నారు.