పరిశోధన పేరుతో కీచక ప్రొఫెసర్‌ వేధింపులు.. | Yale Professor Lured Students To Island | Sakshi
Sakshi News home page

పరిశోధన పేరుతో ప్రొఫెసర్‌ పాడుబుద్ధి..

Aug 23 2019 8:52 PM | Updated on Aug 23 2019 8:52 PM

Yale Professor Lured Students To Island - Sakshi

యేల్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ వర్సిటీ అధికారులను షాక్‌కు గురిచేశాయి..

న్యూయార్క్‌ : ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రతిష్టాత్మక యేల్‌ యూనివర్సిటీ సైకియాట్రి ప్రొఫెసర్‌ రెడ్‌మండ్‌ పరిశోధన పేరుతో విద్యార్ధులను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. విద్యార్ధులకు ఆర్థిక సాయం అందిస్తూ, పరిశోధనలో సహకరిస్తానని లోబరుచుకుని వారిని కరీబియన్‌ దీవుల్లోని తన రీసెర్చి సైట్‌కి తీసుకువెళ్లి సదరు ప్రొఫెసర్‌ లైంగికంగా వేధిస్తున్న ఉదంతం వర్సిటీ అధికారులను షాక్‌కు గురిచేసింది. 1992 నుంచి ఈ కీచక ప్రొఫెసర్‌ ఇదే తంతు కొనసాగిస్తున్నా యేల్‌ వర్సిటీ అధికారులు పసిగట్టలేకపోవడం గమనార్హం. విద్యార్ధులను దశాబ్ధాల తరబడి లైంగికంగా వేధిస్తున్న ప్రొఫెసర్‌ లీలలు వర్సిటీ అధికారులు ఇటీవల వెల్లడించిన 54 పేజీల నివేదికలో బహిర్గతమయ్యాయి. దాదాపు 44 ఏళ్లుగా యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు అనుబంధంగా సైకియాట్రీ పాఠాలు బోధిస్తున్న రెడ్‌మండ్‌ నీచబుద్ధి దిగ్భ్రాంతి కలిగిస్తోంది. రెడ్‌మండ్‌ 13 మంది వరకూ గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధులను లైంగికంగా వేధించినట్టు వెల్లడైంది. 38 మంది ప్రస్తుత, పూర్వ విద్యార్ధులు సహా 110 మంది సాక్షులను విచారించిన అనంతరం ఈ షాకింగ్‌ విషయాలు వెల్లడించాయి.

వర్సిటీ అధికారుల నివేదికకు ముందే కీచక ప్రొఫెసర్‌ బాగోతాన్ని యేల్‌ డైలీ న్యూస్‌ పత్రిక సవివరంగా ప్రచురించింది. మరోవైపు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను రెడ్‌మండ్‌ తోసిపుచ్చారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ కథనాలను వండివార్చారని ఆరోపించారు. యేల్‌ క్యాంపస్‌ నుంచి రెడ్‌మండ్‌ను బహిష్కరించినా రిటైర్డ్‌ ఫ్యాకల్టీ మెంబర్‌గా అన్ని ప్రయోజనాలను ఆయన అనుభవిస్తున్నారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్‌ నేరారోపణలు నమోదు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ ప్రొఫెసర్‌ రెడ్‌మండ్‌ చేష్టలను యేల్‌ వర్సిటీ ప్రెసిడెంట్‌ పీటర్‌ సలోవే ఖండించారు. రెడ్‌మండ్‌ ప్రవర్తన పట్ల యేల్‌ తరపున తాను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. రెడ్‌మండ్‌ ప్రవర్తన తొలిసారిగా వెలుగుచూసినప్పుడే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండేదని అన్నారు.

994లోనే రెడ్‌మండ్‌ విద్యార్ధులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మెడికల్‌ స్కూల్‌ సైకియాట్రి విభాగాధిపతికి పలువురు అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్ధులు తొలిసారిగా ఫిర్యాదు చేశారు. అప్పట్లో తన సమ్మర్‌ రీసెర్చి కార్యక్రమాన్ని మూసివేస్తానని రెడ్‌మండ్‌ హామీ ఇచ్చినా ఆ పనికి పూనుకోలేదు. యేల్‌ అధికారులు సైతం ఆయన రీసెర్చి ప్రోగ్రాంను నిలిపివేసేలా చర్యలు చేపట్టలేదని నివేదిక ఎత్తిచూపింది. 1994లోనే ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై నిర్ధిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు సరైన పర్యవేక్షణ చేపడితే రెడ్‌మండ్‌ విపరీత ప్రవర్తనకు అప్పుడే అడ్డుకట్ట పడేదని నివేదిక స్పష్టం చేసింది. 2018లో రెడ్‌మండ్‌పై ఓ విద్యార్ధి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా, ఆయనపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేలోపుగా అదే ఏడాది రెడ్‌మండ్‌ పదవీవిరమణ చేయడంతో విచారణ అతీగతీ లేకుండా పోయిందనే విమర్శలు వినిపించాయి. ప్రొఫెసర్ల లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేసినా వారిని విధుల్లో కొనసాగనివ్వడం పట్ల విద్యార్ధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement