సాకలేక పది వేలకు అమ్మేసింది

Women  Selling Male Child In Rangareddy - Sakshi

ఇబ్రహీంపట్నంరూరల్‌: సాకలేక కన్నబిడ్డను విక్రయించింది ఆ తల్లి. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఆదిబట్ల సీఐ బిక్షపతి, ఎస్‌ఐ మోహన్‌రెడ్డి వెల్లడించారు. బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడ గ్రామంలోని ఇందినగర్‌ గుడిసెల్లో నివాసం ఉంటున్న పైడాల బాలరాజ్‌ భార్య పద్మ అలియాస్‌ మంగ కూలి పని చేసుకొని జీవనం సాగించేది. మంగకు మూడు నెలల మగ శిశువు ఉన్నాడు. కొన్ని నెలల క్రితం మంగ భర్త బలరాజ్‌ వదిలేయడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. కొద్ది రోజుల క్రితం మంగ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. సంపాదన లేక బిడ్డను సాకలేని పరిస్థితి ఏర్పడింది. సరైన పోషణ కోసం మూడు నెలల మగబిడ్డను అమ్మడానికి మంగ సిద్ధమైంది.

ఈ క్రమంలో పక్కనే రాజీవ్‌గృహకల్పలో నివాసం ఉంటున్న వారికి అమ్మకానికి పెట్టింది.  మగ శిశువును రూ.10వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ నెల 23న సాయంత్రం కుమ్మరి లక్ష్మమ్మకు మంగ తన మూడు నెలల బిడ్డను ఇచ్చి రూ.500 తీసుకుంది. మిగతా డబ్బులు త్వరలోనే ఇస్తామని లక్ష్మమ్మ శిశువును తీసుకెళ్లింది. అయితే, లక్ష్మమ్మ ఇంటి పక్కల వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. లక్ష్మమ్మ దంపతులను విచారించగా.. మంగ దగ్గర కొనుగోలు చేసినట్టు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శిశువు తల్లి మంగ, కొనుగోలు చేసిన లక్ష్మమ్మ చెన్నయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మూడు నెలల బాబును అంగన్‌వాడీ అధికారుల సమక్షంలో శిశువిహార్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top