మూల మలుపు... మృత్యు పిలుపు..

Women Died In Road Accident  - Sakshi

రెండు ఆటోలు ఢీకొని మహిళ మృతి

మరో పదిమందికి గాయాలు

 కొణిజర్ల, ఖమ్మం : మండలంలోని పల్లిపాడు నుంచి ఏన్కూర్‌ వరకు డబుల్‌ రోడ్‌ నిర్మాణం చేపట్టిన తర్వాత పల్లిపాడు-లాలాపురం గ్రామాల మధ్యనున్న మూల మలుపు.. మృత్యు పిలుపుగా మారింది. ప్రాణాలు తీస్తున్నది. ఈ మూల మలుపు వద్ద కల్వర్టును వెడల్పు చేయకపోవడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. ఇది, ప్రమాదాలకు కారణమవుతోంది. శుక్రవారం ఉదయం పల్లిపాడు సమీపంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో మహిళ మృతిచెందింది.

మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. పల్లిపాడు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. పల్లిపాడుకు చెందిన పదిమంది కూలీలను పక్క గ్రామానికి ఆటో డ్రైవర్‌ లకావత్‌ కృష్ణ తీసుకెళుతున్నాడు. పల్లిపాడు-లాలాపురం మధ్యనున్న మూల మలుపు వద్ద లాలాపురం వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఆటో ఎదురుగా ఢీకొంది. ఆటోలో కుడి వైపు కూర్చున్న పల్లిపాడుకు చెందిన ధరావత్‌ లక్ష్మి(35) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.

డ్రైవర్‌ లకావత్‌ కృష్ణ, ప్రయాణికులు కోలబోయిన సువర్ణ, భూక్యా నాగమణి, భూక్యా మంగమ్మ, ధరావత్‌ కావేరి, గుగులోత్‌ కాంతమ్మ, గుగులోత్‌ సుజాత, ఎనగంటి పద్మ, భూక్యా సమత, సపావట్‌ అరుణ గాయపడ్డారు. వీరిలో కోలబోయిన సువర్ణ పరిస్థి«తి విషమించింది. ఖమ్మంలోని ప్రయివేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. 

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇచ్చినప్పటికీ 108 వాహనం వెంటనే రాలేదు. దీంతో క్షతగాత్రులను ఆటోలలో, ఇతర వాహనాలలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కొణిజర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top