
మాట్లాడుతున్న సీఐ సురేష్‌బాబు
నెల్లూరు , బుచ్చిరెడ్డిపాళెం: తన వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలిసిపోయిందని భార్య, ఆమె ప్రియుడు కలిసి అతడిని హత మార్చారని బుచ్చిరెడ్డిపాళెం సీఐ కె.సురేష్‌బాబు తెలిపారు. దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి చెందిన చల్లా రాజా అనే వ్యక్తిది హత్య అని ఆయన తెలిపారు. శుక్రవారం హత్యకు దారితీసిన కారణాలను ఆయన వివరించారు. సీఐ కథనం మేరకు.. ఉలవపాళ్లకు చెందిన చల్లా రాజా 2018 నవంబరు 5వ తేదీన ప్రమాదవశాత్తు మృతిచెందాడని మృతుడి తండ్రి జయరామయ్య ఫిర్యాదు చేశాడు. అయితే మృతిపై అనుమానాలున్నాయని చెప్పడంతో దగదర్తి పోలీసు స్టేషన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి ఆధారాలు సేకరించారు.
ఫోన్‌కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో రాజా భార్య స్వాతి (25)కి సమీప బంధువైన చల్లా శ్రీనివాసులు (40)కు వివాహేతర సంబంధం ఉందని తేలింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి. నవంబర్ 5వ తేదీన శ్రీనివాసులు, స్వాతి ఉలవపాళ్ల గ్రామంలోని జామాయిల్‌తోటలో ఉండడాన్ని రాజా చూశాడు. దీంతో తమ విషయం బయటపడుతుందని వారిద్దరూ కలిసి బలంగా రాజాను కొట్టారు. పక్కనే ఉన్న నేలబావిలోకి తోసి వేయడంతో రాజా మృతిచెందాడు. విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో హత్యకేసుగా నమోదుచేసి వారి కోర్టుకు హాజరుపరిచామని సీఐ తెలిపారు.