
జైపూర్ : రాజస్తాన్‌లో దారుణం జరిగింది. అక్కా, చెల్లెల్ని బంధించి రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాధితుల్లో ఓ మైనర్ బాలిక ఉండడం గమనార్హం. రాజస్తాన్‌లోని ధోల్పూర్ జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోల్పూర్ జిల్లాకు చెందిన నరేష్ గుర్జార్ అనే వ్యక్తి అదే జిల్లాకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్ని ఏప్రిల్ 24న కిడ్నాప్ చేశాడు. ఇంటి నుంచి మార్కెట్‌కు వెళ్తున్న సమయంలో ఇద్దరిని అపహరించి గుర్తుతెలియని ప్రదేశానికి తరలించాడు. అనంతరం వారిని గదిలో బంధించి రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అతని చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న మైనర్ బాలిక పోలీసుల ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేశారు. తన అక్క ఇంకా అక్కడే ఉందని అతను ప్రతి రోజు తమపై అత్యాచారానికి పాల్పడుతూ నరకం చూపిస్తున్నారని వాపోయారు. తమను బంధించిన ప్రాంతం తనకు తెలియదని చెప్పారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. యువతిని బంధించి ఉన్న ప్రాంతాన్ని కనుక్కునేందుకై ప్రత్యేక టీమ్‌లు బరిలోకి దిగాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.