డబ్బుల కోసమే జంట హత్యలు  | Two Persons Assasinated For Money In Kamareddy | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసమే జంట హత్యలు 

Jul 1 2020 10:17 AM | Updated on Jul 1 2020 10:19 AM

Two Persons Assasinated For Money In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి : చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు డబ్బుల కోసం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు. కామారెడ్డిలో ఇటీవల కలకలం రేపిన జంట హత్యల కేసును రూరల్‌ పోలీసులు చేధించారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శ్వేత వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని బడాయిగల్లీకి చెందిన విఘ్నేష్‌ కుమార్‌ అలియాస్‌ చింటు అనే యువకుడు ఇంటర్‌ చదువును మధ్యలోనే ఆపేసి స్థానికంగా ఉన్న ఓ ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నాడు. మద్యం తాగడం, దుబారా ఖర్చులు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈక్రమంలో ఆర్‌ఎంపీ వైద్యుడు వడ్ల సుధాకర్‌తో ఇతనికి కొద్దిరోజులుగా పరిచయం ఉంది. సుధాకర్‌ వద్ద డబ్బులు ఉండటాన్ని గమనించి అతని వద్దనుంచి ఎలాగైనా డబ్బులు కాజేయాలని పథకం వేసుకున్నాడు. ఈమేరకు విఘ్నేష్‌ మార్కెట్‌లో ఒక నకిలీ బంగారం చైన్‌ను కొనుగోలు చేశాడు.

తన వద్ద బంగారు గొలుసు ఉందనీ, అత్యవసరంగా తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వాలని సుధాకర్‌ను అడిగాడు. రాత్రికి మద్యం సేవించే దగ్గర కలుద్దామని అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప«థకం ప్రకారం ఇంటినుంచి షటిల్‌ బ్యాటు కవర్‌లో గొడ్డలిని పెట్టి వెంట తెచ్చుకున్నాడు. కాలనీకి కొద్ది దూరంలో మద్యం సేవించడానికి సుధాకర్‌తో పాటు అతని ఇంటి నిర్మాణం పనుల్లో చేదోడుగా ఉంటున్న లింగంపేటకు చెందిన లక్ష్మయ్య కూడా వచ్చాడు. విఘ్నేష్‌ కావాలనే వారిద్దరికీ ఎక్కువగా మద్యం తాగించాడు. వెంటనే తాను ఇచ్చిన చైన్‌ నకిలీదని గ్రహించేలోపే విఘ్నేష్‌ గొడ్డలి తీసుకుని సుధాకర్‌పై దాడిచేశాడు. కేకలు వేసిన లక్ష్మయ్యను తలపై గొడ్డలితో నరికి చంపాడు. పారిపోతున్న సుధాకర్‌ను కొద్దిదూరం వెంటాడి పట్టుకుని నరికి చంపాడు. ఆ తర్వాత సుధాకర్‌ జేబులోంచి రూ 120, లక్ష్మయ్య జేబులోంచి రూ.2500, సెల్‌ఫోన్‌లను తీసుకుని పారిపోయాడు.

ఫోన్‌కాల్స్, సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా విఘ్నేష్‌ను అనుమానించిన పోలీసులు సోమవారం స్టేషన్‌రోడ్‌లో అరెస్ట్‌ చేసి విచారించారు. అతడునేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు విఘ్నేష్‌కుమార్‌ ఎలాగయినా ఎక్కువ డబ్బులు సంపాదించాలని నేరాల బాట పట్టాడు. గత మే నెలలో కామారెడ్డిలోని స్టేషన్‌రోడ్‌లో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎం, సిరిసిల్లా రోడ్‌లో ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలను పగులగొట్టేందుకు విఫలయత్నం చేశాడు. దీంతొ నిందితునిపై జంట హత్యల నేరంతో పాటు ఏటీఎం చోరీలకు సంబంధించిన కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. కేసు చేధనలో విశేషంగా కృషిచేసిన కామారెడ్డి రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, సీసీఎస్‌ సీఐ అభిలాష్, ఎస్‌ఐలు శేఖర్, ఉస్మాన్, శ్రీకాంత్, ఏఎస్సై గణపతి, సిబ్బందిని ఎస్‌పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement