శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

Two passengers detained with 3kg gold at Shamshabad airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. కోటి 10 లక్షల విలువ చేసే 3 కిలోల 951 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడు తన లోదుస్తులకు ప్రత్యేకంగా జేబును కుట్టుకొని అందులో బంగారు బిస్కెట్లు తేవడానికి ప్రయత్నించగా, కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. బుధవారం కూడా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరిలో ఒకరు రెక్టమ్‌ కన్‌సీల్‌మెంట్‌ రూపంలో, మరొకరు పౌడర్‌గా మార్చి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిద్దరి నుంచి 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు సూత్రధారుల కోసం లోతుగా విచారిస్తున్నారు.

కాగా, బంగారం అక్రమ రవాణాలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్‌ విభాగం కమిషనర్‌ ఎంఆర్‌ఆర్‌ రెడ్డి వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40 కేజీల పసిడి స్వాధీనం చేసుకోగా.. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 10 కేజీలు చిక్కినట్లు తెలిపారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగిస్తున్నారని, మరికొందరు కమీషన్‌ కోసం క్యారియర్లుగా మారుతున్నారని అన్నారు. అదనపు కమిషనర్‌ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్‌ కల్యాణ్‌ రేవెళ్లతో కలసి శంషాబాద్‌లోని కస్టమ్స్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎంఆర్‌ఆర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొందరు స్మగ్లర్లు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌–దుబాయ్‌ల్లో బంగారం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం నేపథ్యంలో ఈ దందాకు దిగుతున్నారు. నేరుగా దిగుమతి చేసుకుంటే 38.5 శాతం వరకు కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉండటంతో స్మగ్లింగ్‌కు తెగబడుతున్నారు.

అయితే ఎక్కడా వీళ్లు నేరుగా సీన్‌లోకి రావట్లేదు. ఆయా దేశాల నుంచి వస్తున్న కొందరు యువతను కమీషన్‌ పేరుతో ఆకర్షిస్తున్న స్మగ్లర్లు తమ తరఫున పనిచేసేలా చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్‌ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని వారినీ ఈ రొంపిలోకి దింపుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న స్మగ్లింగ్‌ గ్యాంగ్‌ల సభ్యులు అక్కడి ట్రావెల్‌ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న పేద, మధ్య తరగతి వారిని గుర్తిస్తున్నారు. ఆయా ప్రయాణికుల్ని సంప్రదిస్తున్న ముఠా సభ్యులు తాము అప్పగించిన వస్తువులు తీసుకువెళ్లేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్‌ ఇస్తుండగా.. మరికొందరికి టికెట్‌ కొనిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామని తెలియట్లేదు. అలా ఉండేందుకు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్‌ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్‌ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్‌ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్‌ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు’ అని అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top