ఫేస్‌బుక్‌లో ఎక్కువ లైక్‌లు వచ్చాయని చితక్కొట్టారు..!

Two Friends Fight for facebook likes - Sakshi

బట్టలు విప్పించి ఊరేగించిన వైనం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘటన 

మహబూబ్‌నగర్‌ క్రైం: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో తన కంటే తన స్నేహితుడి ఫొటోకి ఎక్కువ లైక్‌లు రావడంతో అతడిని చితకబాదారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం వెలుగుచూసింది. మహబూబ్‌నగర్‌ రూరల్‌ ఎస్సై ఖాజాఖాన్‌ కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మర్లు ప్రాంతానికి చెందిన చాణిక్య ఫొటో, స్థానిక వేపూర్‌గేరికి చెందిన బంటి ఫొటోను శనివారం ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అప్‌లోడ్‌ చేశారు. అయితే వీరిలో చాణిక్య ఫొటోకు ఎక్కువ మంది లైక్‌ కొట్టడంతో పాటు కామెంట్లు పెట్టారు. దీంతో తనకంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయని తట్టుకోలేక చాణిక్యను కొట్టాలని బంటి పథకం రచించాడు.

చాణిక్య స్నేహితుడు శ్రీకాంత్‌చారిని వెంటబెట్టుకుని బంటి స్నేహితులు దత్తు, శ్యాం, జగదీశ్, శివ, సందీప్, శివసాయి, రోహిత్, విష్ణు, మధుచారి, నందివర్ధన్‌రెడ్డి కలిసి అదేరోజు రాత్రి 9.30 గంటలకు చాణిక్య ఇంటికి వెళ్లి అతడిని బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొంత దూరం తీసుకెళ్లి బంటికి సారీ చెప్పాలని అతని స్నేహితులు చాణిక్యను బలవంతపెట్టారు. మాట వినకపోవడంతో వెంట తీసుకొచ్చిన ఇనుప రాడ్లు, కట్టెలతో చాణిక్యపై దాడి చేశారు. అంతేకాకుండా బట్టలు విప్పించి తిప్పించారు. ఇంతలో శ్రీకాంత్‌చారి వెళ్లి చాణిక్య తల్లిదండ్రులతో పాటు ఇతర బంధువులను తీసుకురావడంతో వాళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top