అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు | Two Boys Disappeared And Floated In Pond In Mylardevpally | Sakshi
Sakshi News home page

అదృశ్యమై.. చెరువులో శవాలై తేలారు

Jul 28 2019 7:39 AM | Updated on Jul 28 2019 7:39 AM

Two Boys Disappeared And Floated In Pond In Mylardevpally - Sakshi

సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి : అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు చెరువులో శవాలై తెలిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. శాస్త్రీపురం కింగ్స్‌ కాలనీకి చెందిన నిజాముద్దీన్‌ కుమారుడు తౌఫిక్‌ (9), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌ కుమారుడు ఫారుఖ్‌ (11) స్నేహితులు. వీరిద్దరూ కాలాపత్తర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో నాల్గవ తరగతి చదువుతున్నారు. ఈ నెల 25వ తేదీన స్కూల్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు.

అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆడుకునేందుకు ఇద్దరు కలిసి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా చిన్నారుల జాడ తెలియలేదు. దీంతో శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, శనివారం ఉదయం బంరూక్‌ దౌలా చెరువులో రెండు మృతదేహాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది.

దీంతో పోలీసులతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాలను వెలికితీసి పరిశీలించారు. అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు తౌఫిక్, ఫారుఖ్‌లుగా గుర్తించారు. వెంటనే ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. చెరువు వద్దకు స్నానానికి వెళ్లారా..? లేక ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారా..? ఎవరైనా హత్య చేసి పడవేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారుల మృతితో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement