ఇద్దరు బ్యాటరీ దొంగల అరెస్టు

Two battery thieves arrested - Sakshi

రూ.3.75 లక్షల విలువ చేసే 71 బ్యాటరీల స్వాధీనం

కడ్తాల్‌(కల్వకుర్తి): గత కొంతకాలంగా జిల్లాలోని కడ్తాల్‌ షాద్‌నగర్‌తో పాటు, ఐజ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ జిల్లా తదితర ప్రాంతాల్లో పలు వాహనాల బ్యాటరీలు దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు షాద్‌నగర్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీ సురేందర్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో షాద్‌నగర్‌ టౌన్‌ సీఐ అశోక్‌కుమార్, కడ్తాల్‌ ఎస్‌హెచ్‌వో సుందరయ్యతో కలిసి ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన కావేటి శ్రీనివాస్‌ అలియాస్‌ శ్రీను, జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలం తప్పట్ల నర్సు గ్రామానికి చెందిన దేవరేటి తిమ్మప్ప అలియాస్‌ శివ స్నేహితులు. వీరిద్దరూ రాత్రి వేళల్లో నిలిపి ఉన్న వాహనాల బ్యాటరీలు చోరీ చేసి హైదరాబాద్, బుద్వేలు, రాజేంద్రర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో దాచిపెడుతున్నారు. ఇటీవల జిల్లాలోని కడ్తాల్, షాద్‌నగర్‌ ప్రాంతాలతో పాటు, ఐజ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూల్‌ జిల్లా తదితర ప్రాంతాల్లో 80 వరకు వాహనాల బ్యాటరీలు చోరీ అయ్యాయి.

ఇదిలా ఉండగా గత మార్చి 28న కడ్తాల్‌లో, 29న షాద్‌నగర్‌ రెండు ప్రదేశాలలో పలు వాహనాల బ్యాటరీలు మాయం కావడంతో సంబంధిత వాహనాల యాజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వాహన తనిఖీలలో భాగంగా మంగళవారం ఉదయం కడ్తాల్‌ ఎస్‌హెచ్‌వో సుందరయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తలకొండపల్లి  చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న టాటా ఏస్‌ వాహనంలో 8 బ్యాటరీలను గుర్తించిన పోలీసులు వాహనాన్ని నిలిపి తనిఖీ చేసి విచారించగా వారు బ్యాటరీల దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

పోలీసుల విచారణలో రూ.4.23లక్షల విలువ చేసే80 బ్యాటరీలను చోరీ చేసి హైదరాబాద్, బుద్వేలు, రాజేంద్రర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో దాచిపెట్టామని తెలిపారు. ఇదిలా ఉండగా రూ. 3.75 లక్షల విలువ చేసే 71బ్యాటరీలను, వివిధ ప్రాంతాలలో స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ సురేందర్‌ తెలిపారు. చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులలో కావేటి శ్రీనుపై గతంలో పలు పోలీస్‌స్టేషన్‌లలో దొంగతనం కేసులున్నట్లు చెప్పారు. స్వాధీన పరుచుకున్న బ్యాటరీలను కోర్టుకు సమర్పించి, నిందితులిద్దర్నీ రిమాండ్‌కు తరలించనున్నట్లు  తెలిపారు. 
పోలీసు సిబ్బందికి ప్రశంస.. 
బ్యాటరీల చోరీ కేసును స్వల్ప కాలంలో ఛేదించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ  సురేందర్‌ ప్రత్యేకంగా అభినందించారు. షాద్‌నగర్‌ సీఐ అశోక్‌కుమార్, కడ్తాల్‌ ఎస్‌హెచ్‌వో సుందరయ్యలతో పాటు, ఆమనగల్లు, కొందుర్గు, నందిగామ, తలకొండపల్లి, షాద్‌నగర్, కడ్తాల్‌ పోలీస్‌ స్టేషన్‌లలో క్రైమ్‌ డిపార్టుమెంట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్‌ అబ్దుల్లా, గురుప్రసాద్, శేఖర్, రవీందర్, శివకుమార్, యాదగిరిలను అభినందించారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందానికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top