చదువు ఇష్టంలేక ఆత్మహత్య

Tenth Class Student Suicide In Karimnagar - Sakshi

జగిత్యాలక్రైం: చదువుఇష్టం లేక ఓ పదో తరగతి విద్యార్థి డీజిల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. ఇటీవల ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలోనే ఈ విద్యార్థి సైతం బలవన్మరణానికి పాల్పడడం జగిత్యాల జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది.
 
పోలీసుల వివరాల ప్రకారం.. 
జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన దుర్గపు జగదీశ్‌(15) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు.అయితే కొద్దిరోజులుగా చదువు ఇష్టం లేకపోవడంతో దిగాలుగా ఉండేవాడు. గమనించిన తల్లిదండ్రులు సముదాయించి పాఠశాలకు పంపిస్తుండేవారు. ఇటీవల దసరా సెలవులు రావడం, 15రోజులు సంతోషంగా గడిపిన జగదీశ్‌ మళ్లీ పాఠశాలకు వెళ్లి చదువుకోవడాన్ని ఇష్టపడలేదు. దీంతో తనను ఎలాగైనా పాఠశాలకు పంపిస్తారనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని మిషన్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో నిర్మాణుశ్య ప్రాంతంలో బుధవారం డీజిల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతనెలలో ఇదే ప్రాంతంలో పదో తరగతి విద్యార్థులు రవితేజ, మహేందర్‌లు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

నాన్న మంచిర్యాలలో... అమ్మ కొడుకు వద్ద.. 
జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన దుర్గపు గంగాధర్‌– లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. గంగాధర్‌ ఉపాధి నిమిత్తం మంచిర్యాలలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయన వద్దే పెద్ద కుమారుడు రంజిత్‌ ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. చిన్న కుమారుడు జగదీశ్‌ పదో తరగతి చదువుతుండడంతో తల్లి లక్ష్మి జగిత్యాలలోనే ఉంటోంది. దసరా సెలవుల నేపథ్యంలో ఇద్దరు కుమారులతో పాటు తల్లిదండ్రులు మంచిర్యాలలోనే గడిపారు. సెలవుల అనంతరం పాఠశాల ప్రారంభం కావడంతో జగదీశ్‌ ఆయన సోదరుడు రంజిత్‌ మంగళవారం జగిత్యాలకు చేరుకున్నారు.

అయితే బుధవారం ఉదయం కడుపునొస్తోందని, పాఠశాలకు వెళ్లనని చెప్పిన జగదీశ్‌ ఉదయం 10గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. డీజిల్‌ కొనుక్కుని మిషన్‌కాంపౌండ్‌ ప్రాంతంలోని నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లి డీజిల్‌ పోసుకుని నిప్పంటించుకోవడంతో మంటలు తట్టుకోలేక కేకలు వేశాడు. స్థానికులు వెళ్లి చూసేసరికి మృతిచెందాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వద్ద సెల్‌ఫోన్, పాఠశాలకు చెందిన పుస్తకాలు ఉండటంతో పోలీసులు గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్పీ సింధూశర్మ, డీఎస్పీ వెంకటరమణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుని తండ్రి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ ప్రకాశ్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top