రూ.10 ఇచ్చి.. రూ.50 లక్షలు తీసుకుని!

Task Force Police Arrested Four In Gujarathi Street Hyderabad - Sakshi

నగరానికి చెందిన కాంట్రాక్టర్‌ హుండీ ‘దారి’

నిర్వాహకుడి నుంచి నగదు తీసుకున్న వైనం

నలుగురిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

రూ.72.73 లక్షల నగదు, కౌంటింగ్‌ మిషన్‌ స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: అది గుజరాతీ గల్లీలోని ఓ దుకాణం... అందులో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు... బుధవారం ఉదయం అక్కడికో తునికాకు కాంట్రాక్టర్‌ హడావుడిగా వచ్చాడు... తన జేబులో ఉన్న రూ.10 నోటు ఇచ్చాడు... దీనిని తీసుకున్న ఓ వ్యక్తి సీరియల్‌ నంబర్‌ చూసి సంతృప్తి చెందాడు... అతడికి రూ.50 లక్షలతో కూడిన బ్యాగ్‌ అందించాడు... అదే సమయంలో దాడి చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. దేశీయంగా జరుగుతున్న హుండీ దందా గుట్టును రట్టు చేసి రూ.72.73 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. ఆదాయపుపన్ను ఎగ్గొట్టడానికి, నల్లధనం లావాదేవీలకు, అసాంఘిక కార్యకలాపాలకు ఈ మార్గంలో ఆర్థిక లావాదేవీలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. 

రాజస్థాన్‌ నుంచి వచ్చి దందా...
రాజస్థాన్‌కు చెందిన లాల్‌ చంద్‌ పాండ్యా బతుకుదెరువు నిమిత్తం  నగరానికి వలసవచ్చి ఇసామియాబజార్‌లో స్థిరపడ్డాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఇతగాడు దేశ వ్యాప్తంగా ఉన్న హవాలా (రెండు దేశాల మధ్య అక్రమ ద్రవ్యమార్పిడి), హుండీ (దేశంలో జరిగే అక్రమ ద్రవ్యమార్పిడి) దందాలు చేసే వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తానూ ఇదే వ్యాపారం చేస్తే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుందని భావించిన అతను గుజరాతీ గల్లీలో ఓ దుకాణం అద్దెకు తీసుకుని హుండీ వ్యాపారం ప్రారంభించాడు. రాజస్థాన్‌ నుంచి వలసవచ్చిన బజరంగ్‌లాల్‌ ప్రణీక్, దిలీప్‌ కుమార్‌లను కలెక్షన్‌ ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఉన్న హుండీ, హవాలా ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకున్నాడు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 వరకు కమీషన్‌ తీసుకుంటూ దందా కొనసాగిస్తున్నాడు. ఓ మెట్రో నగరంలో ఉన్న ఇతడి అనుబంధ ఏజెంట్‌కు నగదు అప్పగించి ఎక్కడ, ఎవరికి డెలివరీ ఇవ్వాలో చెబుతారు. అక్కడి వారు స దరు వ్యక్తికి రూ.1 నుంచి రూ.10 వరకు ఏదో ఒక డినామినేషన్‌లో ఉన్న కరెన్సీ ఇస్తారు. దీని సీరియల్‌ నంబర్‌ను డెలివరీ ఇవ్వాల్సిన ఏజెంట్‌కు చెబుతారు. ఈ నోటు ఎవరు తీసుకువచ్చి ఇస్తే వారికి కమీషన్‌ పోగా ఆ మొత్తాన్ని అందజేస్తారు. 

ఢిల్లీ నుంచి వచ్చిన తునికాకు సొమ్ము...
వరంగల్‌కు చెందిన కె.తిరుపతిరావు నగరంలోని హబ్సిగూడలో ఉంటూ ఛత్తీస్‌గడ్‌లో తునికాకు కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. అతను ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యాపారికి తునికాకు విక్రయించాడు. దానికి సంబంధించి తిరుపతిరావుకు రూ.50 లక్షలు రావాల్సి ఉంది. ఆ మొత్తాన్ని హుండీ రూపంలో పంపాల్సిందిగా ఇతడు సదరు వ్యాపారికి చెప్పాడు. ఆ వ్యాపారి నగదును ఢిల్లీలో ఉన్న ఏజెంట్‌ శ్యామ్‌లాల్‌కు అందించాడు. అతడు ఇచ్చిన రూ.10 నోటును (సీరియల్‌ నెం.45జీ080304) తిరుపతి రావుకు ఇచ్చాడు. దీనిని తీసుకుని వచ్చిన ఈయన బుధవారం లాల్‌చంద్‌కు అందజేయడంతో సీరియల్‌ నంబర్‌ సరిచూసుకున్న లాల్‌చంద్‌ రూ.50 లక్షలు ఓ బ్యాగ్‌లో పెట్టి తిరుపతిరావుకు అందజేశాడు. దీనిపై సమాచారం అందడంతో సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం దాడి చేసింది. తిరుపతిరావుతో పాటు లాల్‌చంద్, బజ్‌రంగ్, దిలీప్‌లను అదుపులోకి తీసుకుంది. దుకాణంలో ఉన్న రూ.72.73 లక్షల నగదు, కౌంటింగ్‌ మిషన్, రూ.10 నోటు స్వాధీనం చేసుకుని కేసును ఆదాయపుపన్ను శాఖకు అప్పగించారు. వీరి లావాదేవీలన్నీ కోడ్‌భాషలో సాగుతున్నాయని, ప్రతి ట్రాన్సాక్షన్‌ తర్వాత దానికి సంబంధించిన పత్రాలు ధ్వంసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top