ప్రాణం తీసిన స్టాక్‌ మార్కెట్‌

Sushma suicide due to stock markets losses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  స్టాక్‌మార్కెట్‌లో లావాదేవీలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. జూదాన్ని తలపించే షేర్‌ మార్కెట్‌ వ్యాపారం చేయాలంటే మార్కెట్‌పై అవగాహన, నిపుణుల సలహాలు, సూచనలు చాలా అవసరం.  లేదంటే ప్రాణాలతో చెలగాటమే.  షేర్‌ మార్కెట్‌లో కోట్లాది రూపాయలను పోగొట్టుకుని  ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు  కోకొల్లలు.  అప్పుల భారంతో కుటుంబాలకు కుటుంబాలే బలైపోయిన  ఉదంతాలు కూడా చాలానే ఉన్నాయి.   తాజాగా షేర్‌​ మార్కెట్‌ నష్టాలకు ఓ యువతి  ఆహూతై పోయింది.
 
విశాఖకు చెందిన  సుష్మ(27) స్టాక్‌మార్కెట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అవగాహనాలోపమో, అత్యాశో, ఏ మాయాజాలమో ఏమోగానీ ఆమె పెట్టుబడులన్నీ  ఆవిరైపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఒక హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.  విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని ఉస్మానియా  ఆసుపత్రికి తరలించారు.  నిన్న రాత్రే సుష్మ  ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది.  సుష్మ ఆత్మహత్యకు షేరు మార్కెట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు తెలిపారు.  ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top