వ్యసనాలకు బానిసై..చోరీలకు అలవాటై..

students arrested in robbery case - Sakshi

దొంగతనాలకు పాల్పడుతున్న చదువుకునే యువకులు

రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం

నూజివీడు :  వారు ముగ్గురు చదువుకుంటున్న యువకులే... కానీ వ్యసనాలకు బానిసై...చోరీలు చేయడానికి అలవాటయ్యారు. నూజివీడు పట్టణంలోని కొప్పెలమపేటకు చెందిన ముగ్గురు యువకులు దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. వారి నుంచి  రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చేసిన దొంగతనాల గురించి డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు బుధవారం విలేకర్లకు వెల్లడించారు.

బైక్‌పై తిరుగుతూ చైన్‌స్నాచింగ్‌లు...
 సబ్బవరపు సూర్యతేజ నూజివీడు మండలం వెంకటాద్రిపురంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ ద్వితీయ  సంవత్సరం చదువుతున్నాడు. సీరెడ్డి మనోహర్‌ విజయవాడలో ఫిజియోథెరపీ కోర్సు చదువుతున్నాడు. పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన లోకాల ఫణీంద్ర నూజివీడు మండలం జంగంగూడెంలోని ఐటీఐ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతూ పట్టణంలోని యమహా షోరూంలో పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురూ యమహా బైక్‌పై తిరుగుతూ మెడలో గొలుసు చోరీలు, ఇళ్లు, గుడిలోని హుండీల్లో  నగదు కాజేస్తుంటారు.

వీరిపై నూజివీడు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు, రూరల్‌ స్టేషన్‌లో ఒక కేసు, హనుమాన్‌జంక్షన్‌లో రెండు కేసులు కలిపి మొత్తం ఏడు కేసులున్నాయి. ముందుగా సబ్బవరపు సూర్యతేజ లగ్జరీ జీవితానికి అలవాటై డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతూ ఉండేవాడు. ఆ తరువాత మనోహర్, ఫణీంద్రలను కూడా ఆకట్టుకుని తనతో చేర్చుకుని ముగ్గురూ కలిసి దొంగతనాలు చేస్తున్నారు. 2016 ఆగస్టులో సూర్యతేజను ఒకసారి అరెస్టు చేశారు. బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌ వెంబడించి పట్టుకుని విచారించగా తాము చేసిన చోరీలు ఒప్పుకున్నారు.

బంగారం, వెండినగలు స్వాధీనం...
 నల్లపూసల బంగారు గొలుసులు 3, బంగారు గొలుసులు  2, బంగారు నాన్తాడు 1, బంగారు చెవిజూకాలు 3జతలు, ముక్కపుడక 1, వెండి కిరీటం 1, వెండిహస్తం 1, వెండి దీపారాధన కుందులు 4, వెండి గంధం గిన్నెలు 2, వెండి పళ్లెం 1, వెండి గిన్నెలు 4 స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌కు జిల్లా ఎస్పీ రివార్డు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ మేదర రామ్‌కుమార్, ఎస్‌ఐ రంజిత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top