తల్లిని హతమార్చిన తనయుడు

Son Assassinated Mother in Kurnool - Sakshi

ఏదైనా దెబ్బ తలిగితే వెంటనే అమ్మా అని అరుస్తాం.. కష్టాల్లో ఉన్నప్పుడు మాతృమూర్తి ఓదార్పు కోరుకుంటాం..తల్లి తినిపించిన గోరుముద్దను తలచుకోని సందర్భం ఉండదేమో.. అమ్మ పాడిన జోలపాటను, అమ్మ నేర్పిన మంచి మాటలను మరచిపోలేని వారు ఎందరో ఉన్నారు. అయితే ఓ యువకుడు..గతి తప్పాడు. చెడు అలవాట్లకు బానిసై.. కన్న తల్లిని కిరాతకంగా హతమార్చాడు.     ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.   

కర్నూలు,ఎమ్మిగనూరురూరల్‌: తొమ్మిది నెలలు మోసి కనిపెంచిన తల్లిని ఓ ఉన్మాది బండరాయితో కొట్టి హత్యచేసిన దుర్ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో మంగళవారం ఆర్ధరాత్రి చోటు చేసుకుంది. పట్ణణంలోని లక్ష్మీపేటలో నివాసముంటున్న  రాజు, ఉరుకుందమ్మలకు ముగ్గురు సంతానం. రాజు..లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈయన  పెద్దకుమారుడు వీరేష్‌ చిన్నతనం నుంచి చిల్లర దొంగతనాలతో పాటు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి.. తల్లిదండ్రులను, తమ్ముడిని తిడుతూ వేధింపులకు గురిచేసేవాడు. మద్యం అతిగా తాగినప్పుడు వావి వరసలు మరచి ప్రవర్తించేవాడు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఉరుకుందమ్మ తన భర్త రాజును పిలుచుకురావడానికి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది.

భార్యభర్తలు ఇంటికి వచ్చిన తరువాత ఇంటికి తాళం ఎందుకు వేసి వెళ్లారని వీరేష్‌ గొడవకు దిగాడు. ఇంట్లో ఉండే టీవీని ధ్వంసం చేసి, తినటానికి పెట్టిన అన్నం ప్లేట్‌ను ఇంటి బయట కాలువలో పడేశాడు. అమ్మను ఎందుకు తిడుతున్నావని వీరేష్‌కు తండ్రి అడ్డు చెప్పగా.. దాడి చేయటంతో కిందపడిపోయాడు. తల్లి ఉరుకుందమ్మ అడ్డుపోవటంతో ‘‘ముందు నిన్ను చంపాలి’’ అంటూ నాప బండను తీసుకొని తలపై కొట్టడంతో ఆమె రక్తం మడుగులో కిందపడిపోయింది. అక్కడే ఉన్న రెండో కుమారుడు ఉదయ్‌ అడ్డురాగా చంపుతానని బెదిరించడంతో బయటకు కేకలు వేస్తు పారిపోయాడు. చుట్టుపక్కల వారు వచ్చి వీరేష్‌ను అదుపులోకి తీసుకొని.. గాయపడ్డ  ఉరుకుందమ్మ,  రాజును చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఉరుకుందమ్మ మృతి చెందిందని వైద్యులు చెప్పటంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. హత్య విషయం తెలుసుకున్న టౌన్‌ సీఐ వి. శ్రీధర్, ఎస్‌ఐ శ్రీనివాసులు ప్రభుత్వాసుపత్రిలోని పోస్టుమార్ట్టం గదిలో ఉన్న ఉరుకుందమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీరేష్‌పై టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో దొంగతనాలు, అనుమానితుల కేసు నమోదై ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ  శ్రీధర్‌ తెలిపారు.

హత్యకు గురైన ఉరుకుందమ్మ(ఫైల్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top