నేరాలు.. ఘోరాలు!

So many sensational crime was in this year - Sakshi

ఈ ఏడాది ఎన్నోసంచలనాత్మక ఘటనలు

నయీం కేసు నుంచి నేరెళ్ల దాకా..

పలు కేసుల్లో పోలీసులపై విమర్శలు

ఇంకా చిక్కుముడులు వీడనివి ఎన్నో..

గతంతో పోలిస్తే పోలీసుల పనితీరు మెరుగుపడినా ఈ ఏడాది జరిగిన అనేక నేర ఘటనలు ఆ శాఖకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి! నయీం కేసులో అధికారుల సస్పెన్షన్‌తోపాటు అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణాలు, పరువు హత్యలు, ఆత్మహత్యలు, అమ్మాయిలపై దాడులు.. చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో! అవేంటో ఓసారి చూద్దాం.. 
 -సాక్షి, హైదరాబాద్‌

ఓటుకు కోట్ల కేసులో...
ఓటుకు కోట్లు కేసులో అవినీతి నిరోధక శాఖ సప్లిమెంట్‌ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ కాపీ గవర్నర్‌ కార్యాలయానికి చేరుకోవడం ఒకింత సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఉన్న ఐజీ చారుసిన్హా బదిలీ అనేక నాటకీయ పరిణామాలకు తెరదీసింది. ఇప్పటికీ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో వ్యవహారంపై ఏసీబీ విచారణ జరపకపోవడం విమర్శలకు తావిస్తోంది.

టీడీపీ ఎమ్మెల్సీ కబ్జా కహానీ
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో విలువైన భూముల కబ్జా కేసులో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిని సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆసిఫ్‌నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి వందల కోట్ల విలువైన భూములను స్వాహా చేశారన్న ఆరోపణలతో ఆయన జైలుకు వెళ్లి వచ్చారు.

నామా వేధింపుల స్టోరీ
జూబ్లీహిల్స్‌కు చెందిన ఒంటరి మహిళను వేధింపులకు గురి చేసిన మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వర్‌రావుపై కేసు నమోదవడం సంచలనం రేపింది. మహిళను అసభ్యకరంగా ఫోన్‌లో దూషించడంతోపాటు ఇంటికి వెళ్లి దాడి చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

‘డ్రగ్స్‌’తో టాలీవుడ్‌ షేక్‌
డ్రగ్‌ కేసు టాలీవుడ్‌ను గజగజలాడించింది. బోయినిపల్లికి చెందిన కెల్విన్‌ ద్వారా బయటపడ్డ లింకుతో సినీ ఇండస్ట్రీలోని 12 మంది ప్రముఖులను ఎక్సైజ్‌ శాఖ విచారించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఇందులో ఏమీ తేల్చకుండానే కేసు మూసివేత దశకు చేరుకుంటోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సినిమాను తలదన్నేలా..
నాగర్‌కర్నూల్‌లో ప్రియుడి కోసం భర్తను అత్యంత దారుణంగా హతమార్చిన స్వాతి ఎపిసోడ్‌ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్తను హత మార్చి, ప్రియుడి మొహాన్ని కాల్చి ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా భర్తలా మార్చేందుకు యత్నించి స్వాతి పట్టుబడింది. ఈ వ్యవహారంలో అటు స్వాతి, ఇటు ప్రియుడు రాజేశ్‌ అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

పరువు హత్య
భువనగిరి జిల్లా ఆత్మకూరులో జరిగిన పరువు హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తన కూతురు స్వాతిని మరో కులానికి చెందిన నరేష్‌ కులాంతర వివాహం చేసుకున్నాడని అత్యంత కిరాతకంగా అతడిని అమ్మాయి తండ్రి హతమార్చాడు. ఈ కేసును రాచకొండ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.

ఇటు శిరీష.. అటు ఎస్సై!
బంజారాహిల్స్‌కు చెందిన బ్యుటీషియన్‌ శిరీష ఆత్మహత్య ఘటన అనేక మలుపులు తిరిగింది. తనతో సాన్నిహిత్యం కొనసాగిస్తూనే మరో యువతితో తన ప్రియుడు రాజీవ్‌ పెళ్లికి సిద్ధమవడం శిరీషకు నచ్చకపోవడం, కుకునూర్‌పల్లి ఎస్సై వద్ద సెటిల్‌మెంట్‌ యత్నం చేయడం.. శిరీష ఆత్మహత్యకు పాల్పడిన మరుసటి రోజే ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం సంచలనం రేకెత్తించింది.

టార్గెట్‌.. ముత్తూట్‌
గతేడాది డిసెంబర్‌లో ముత్తూట్‌లో జరిగిన 42 కేజీల బంగారం దోపిడీ ఇంకా పూర్తిగా తేలకముందే అలాంటివే కూకట్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లిలో రెండు ఘటనలు జరిగాయి. మైలార్‌దేవ్‌పల్లి ఘటనలో ఉగ్ర కోణం వైపు అనుమానాలు రావడంతో ఆక్టోపస్‌ బృందాలు అత్తాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ను తీవ్ర ఉత్కంఠ మధ్య రాత్రంతా తనిఖీలు చేశాయి.

మధు మృతి.. ఉద్రికత
మంథనిలో ప్రేమ వ్యవహారంలో దళిత యువకుడు మధుకర్‌ అనుమానాస్పద మృతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన వెనుక ఓ ఎమ్మెల్యే ఉన్నా డంటూ ఆరోపణలు వచ్చాయి. పోలీస్‌ శాఖ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నత కులానికి చెందిన యువతిని మధుకర్‌ ప్రేమించడం వల్లే అమ్మాయి కుటుంబీకులు ఆయన్ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి.

నేరెళ్ల గరంగరం..
రాజన్న సిరిసిల్లా జిల్లా నేరెళ్లలో ఇసుక లారీ దగ్ధం కేసులో పలువురు దళితులపై పోలీసులు చేసిన థర్డ్‌ డిగ్రీ రాజకీయంగా ప్రకంపనలు పుట్టించింది. ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లింది. నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పోలీస్‌ శాఖ.. ఎస్సైని సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకుందన్న అపవాదును మూటగట్టుకుంది.

కోట్లు కొల్లగొట్టిన ‘వాణిజ్య’ స్కాం
వాణిజ్య పన్నుల శాఖలో రూ.300 కోట్ల స్కాం వెలుగు చూసింది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణంలో అధికారులు, బ్రోకర్లు, డిస్ట్రిబ్యూటర్లు కుమ్మక్కై కోట్లు కొల్లగొట్టారు. ఈ కేసులో ఏడుగురు అధికారులను సీఐడీ కటకటాల్లోకి నెట్టింది. నిందితులతో చేతులు కలిపిన ఓ డీఎస్పీని పోలీస్‌ శాఖ సస్పెండ్‌ చేసింది.

నయీం కేసులో సస్పెన్షన్‌
గ్యాంగ్‌స్టర్‌ నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలెదుర్కొంటున్న ఐదుగురు రాష్ట్ర స్థాయి పోలీస్‌ అధికారులు సస్పెండ్‌ కావడం కలకలం రేపింది. అలాగే మరో 21 మందికి చార్జిమెమోలు ఇచ్చి విచారణకు ఆదేశించారు.

ఆదివాసీ వర్సెస్‌ లంబాడీలు
ఉట్నూర్‌ ఘటన ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీలు ఉట్నూర్, హస్నాపూర్‌లో దాడులకు దిగారు. భారీ స్థాయిలో విధ్వంసం జరిగింది. ఇది పలువురు అధికారుల బదిలీకి కారణమైంది. ఎస్పీ, డీఐజీ, కలెక్టర్, ఆర్డీవో, డీఆర్‌వో, డీఎస్పీ... ఇలా పలువురు అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.

ఏడాది చివరలో ఎన్‌కౌంటర్‌
రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు పెద్దగా లేకపోయినా కొన్నికొన్ని చెదురుమదురు ఘటనలు పోలీస్‌ శాఖను కలవరపెట్టాయి. ఏడాది చివర్లో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసు కుంది. డిసెంబర్‌ 14న సీపీఐఎంల్‌ చండ్రపుల్లారెడ్డి బాట దళానికి చెందిన 9 మంది సభ్యులు ఎన్‌కౌంటరయ్యారు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తంచేశాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top