మైనర్‌ భార్యతో కాపురం అత్యాచారమే | Sakshi
Sakshi News home page

మైనర్‌ భార్యతో కాపురం అత్యాచారమే

Published Wed, Oct 11 2017 11:30 AM

sex with minor wife is rape, says supreme court - Sakshi

న్యూఢిల్లీ: మైనర్‌ భార్యతో శృంగారంలో పాల్గొనడం నేరమేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అత్యాచార చట్టంలో ఇచ్చిన మినహాయింపు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని బుధవారం ఘాటుగా వ్యాఖ్యానించింది. 15–18 ఏళ్ల మధ్య వయసున్న మైనర్‌ భార్యతో శృంగారంలో పాల్గొనడం అత్యాచారం కిందకు రాదని ఐపీసీలోని సెక్షన్‌ 375లోని మినహాయింపు–2 చెబుతోందని.. చట్టంలో ఇలాంటి మినహాయింపునివ్వడం నిరంకుశమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బి లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం పేర్కొంది. పార్లమెంటు ఏ విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశ్నించింది. సామాజిక చట్టాలను రూపొందించడంలో చూపుతున్న స్ఫూర్తిని అమలులో మాత్రం చూపడం లేదని కోర్టు అభిప్రాయపడింది.

బాలికల హక్కులు కాలరాసినట్లే!
‘అన్ని చట్టాల్లో కనీస వివాహ వయసు 18 ఏళ్లు. అయితే ఐపీసీలో మాత్రం 18 ఏళ్లలోపు భార్యతో శృంగారంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించకుండా మినహాయించడం నిలకడలేని, నిరంకుశ నిర్ణయం. ఇది బాలికల హక్కులను కాలరాసినట్లే’అని జస్టిస్‌ దీపక్‌ గుప్తా తన తీర్పులో పేర్కొన్నారు.  మినహాయింపునివ్వడం రాజ్యాంగంలోని 14, 15, 21వ అధికరణలను ఉల్లంఘించడమే అని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. అక్షయ తృతీయ సందర్భంగా సామూహిక వివాహాల్లో వేలమంది మైనర్‌ బాలికలకు పెళ్లి చేయడం తనను తీవ్రంగా కలచివేసిందంటూ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రచారం కాదు.. అమలు సంగతేంటి?
సంక్షేమపథకాలకు ఆకర్షణీయమైన నినాదాలు, అద్భుతమైన ప్రచార కార్యక్రమాలు బాగుంటాయని.. అయితే అంతే సమర్థవంతంగా ఆ కార్యక్రమాలను అమలు చేయాలని జస్టిస్‌ లోకూర్‌ తన తీర్పులో పేర్కొన్నారు. మైనర్‌ భార్యతో శృంగారంపై 1984, 2000ల్లో సమర్పించిన రెండు నివేదికల్లో పరస్పర విరుద్ధ అభిప్రాయాలను లా కమిషన్‌ వ్యక్తీకరించిందని సుప్రీంకోర్టు తెలిపింది.

చెల్లని వివాహాల రద్దు ఎలా?
హిందూ, ముస్లిం వివాహ చట్టాల్లోని నిబంధనలు బాల్య వివాహ నిషేధ చట్టాన్ని (పీసీఎంఏ) అపహాస్యం చేసేలా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ముస్లిం వివాహాల రద్దు చట్టం – 1939 ప్రకారం.. 15 ఏళ్ల లోపున్న బాలికకు వివాహం జరిగితే, ఆమె 18 ఏళ్లు నిండక ముందే, అది కూడా భర్తతో శృంగారం జరగకపోతేనే విడాకులను కోరొచ్చు. ‘బాలిక మేజర్‌ కాక ముందే, అది కూడా శృంగారం జరగకపోతేనే విడాకులు కోరొచ్చన్న నిబంధన ఈ చట్టాన్ని అపహాస్యం పాలుచేస్తోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అసలు పీసీఎంఏ కింద చెల్లని వివాహాన్ని రద్దుచేయాలని కోరడం హాస్యాస్పదం అని పేర్కొంది. ఇక హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం.. తనకు 15 ఏళ్లలోపు జరిగిన వివాహాన్ని బాలిక 15 ఏళ్లు దాటిన తరువాత, 18 ఏళ్లు నిండక ముందు రద్దుచేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలుచేయొచ్చని తెలిపింది. అసలు 15 ఏళ్లలోపు వివాహం చెల్లదని, దాని రద్దుని కోరే ప్రశ్నే ఉత్పన్నం కావొద్దని పేర్కొంది.

మైనర్‌ భార్యలు వస్తువులు కాదు : సుప్రీం
పెళ్లి అయిన 18 ఏళ్లలోపు బాలికలను వస్తువులుగా పరిగణించరాదని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాలికలకు తమ శరీరంపై ఎలాంటి హక్కులేదనీ, భర్తతో శృంగారానికి అయిష్టత చూపరాదని కేంద్రం పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాల్యవివాహాలు బాలికల శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు పోషకాహారం, విద్య, ఉపాధి తదితర అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం అభిప్రాయపడింది.

జస్టిస్‌ ఎంబీ లోకూర్‌: ‘మా ముందు ప్రవేశపెట్టిన వివరాల ప్రకారం బాల్యవివాహాల వల్ల బాలికల ఆత్మగౌరవం, విశ్వాసం సన్నగిల్లుతుందని స్పష్టంగా అర్థమవుతోంది. భర్త చేతిలో లైంగిక దాడికి గురయ్యే అమ్మాయి ఇకపై ఆత్మగౌరవంతో జీవిస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదు. అంతేకాకుండా వీరికి పుట్టే పిల్లలు కూడా పోషకాహార లోపంతో పాటు అనేక కారణాలతో పేదరికంలో మగ్గిపోవాల్సి వస్తోంది. ఇలాంటి సాంప్రదాయబద్ధమైన ఆచారం కొనసాగడం అవసరమా? మేమైతే(సుప్రీం) అవసరమని అనుకోవడం లేదు’.

జస్టిస్‌ దీపక్‌ గుప్తా: ‘18 ఏళ్లకు ముందే వివాహమైతే.. బాలికల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుంది. సాధారణ మహిళల కంటే మైనర్‌ బాలికలు ప్రసవం సమయంలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు రెట్టింపుగా ఉన్నట్లు తెలుస్తోంది. సాంప్రదాయం, వివాహ పవిత్రత పేరుతో దీన్ని ప్రభుత్వాలు సమర్ధించటం ఆక్షేపణీయం’.

తీర్పులోని ప్రధానాంశాలు
► భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 375కు ధర్మాసనం సవరణ చేసింది. ఈ సెక్షన్‌ రాజ్యాంగంలోని అధికరణం 14, 15, 21లను ఉల్లంఘిస్తోందంది.  
► చిన్నారుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన అన్ని చట్టాల్లో సమరూపత ఉండాలని ధర్మాసనం పేర్కొంది. బాధితురాలితో ఉన్న బంధానికి అతీతంగా ఒక రేపిస్టు ఎప్పటికీ రేపిస్టేనన్న యూరోపియన్‌ మానవ హక్కుల కమిషన్‌ వ్యాఖ్యలను ఉటంకించింది.
► 18 ఏళ్ల లోపు భార్యతో లైంగిక చర్యలో పాల్గొన్న భర్తను నేరస్తుడిగా పరిగణించనందుకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. సామాజిక సంక్షేమ పథకాలపై ఆకట్టుకునే నినాదాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోదనీ, వాటి అమల్లోనూ చిత్తశుద్ధితో పనిచేయాలంది.
► హిందూ, ముస్లిం మతాల వివాహా చట్టాలు బాల్య వివాహాల నిరోధక చట్టంతో సారూప్యంగా లేవని బెంచ్‌ గుర్తుచేసింది.
► 18 ఏళ్లలోపు బాలికను వస్తువుగా చూడకూడదనీ, గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు ఆమెకు కూడా ప్రాథమిక హక్కులున్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
► మైనర్‌ భార్యకు, భర్తకు మధ్య లైంగిక చర్యను నేరంగా పరిగణించాలా వద్దా అనే విషయంపై భిన్న నిర్ణయాలతో ఉన్న రెండు నివేదికలను లా కమిషన్‌ సమర్పించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇదీ చరిత్ర...
1860: వివాహానికి బాలికకు కనీస వయసును నిర్ధారించకున్నా, భర్తతో శృంగారానికి అంగీకరించడానికి కనీస వయసు 10 ఏళ్లుగా నిర్ణయం
1891: ఈ వయసు 12 ఏళ్లకు పెంపు
1925: శృంగారానికి అంగీకరించేందుకు కనీస వయసు 14 ఏళ్లకు పెంపు, ఐపీసీ సెక్షన్‌ 375లో ఇచ్చిన మినహాయింపును 13 ఏళ్లకు పెంచారు.
1929: బాల్య వివాహ నియంత్రణ చట్టానికి ఆమోదం. వివాహానికి, శృంగారానికి కనీస వయసు 14 ఏళ్లుగా నిర్ధారణ. సెక్షన్‌ 375లో ఇచ్చిన మినహాయింపుకు ఎలాంటి మార్పు చేయలేదు.
1940: ఐపీసీకి చేసిన సవరణల్లో శృంగారానికి కనీస వయసు 16 ఏళ్లకు పెంపు. సెక్షన్‌ 375 మినహాయింపు కింద 15 ఏళ్లకు పెంచారు. వివాహాల నియంత్రణ చట్టం ప్రకారం వివాహానికి బాలికల కనీస వయసు కూడా 15 ఏళ్లుగా నిర్ణయం
1978:ఐపీసీ సవరణల్లో శృంగారానికి కనీస వయసు 16 ఏళ్లుగా నిర్ణయం. మినహాయింపు కింద వివాహ కనీస వయసు 15 ఏళ్లలో మార్పు లేదు. మహిళకు వివాహ కనీస వయసు 18 ఏళ్లకు పెంపు
2013: నిర్భయ ఘటన నేపథ్యంలో శృంగారానికి కనీస వయసు 18 ఏళ్లకు పెంపు

కేంద్రంపై ఆగ్రహం
18 ఏళ్ల లోపున్న భార్యతో ఆమె భర్త శృంగారంలో పాల్గొనడాన్ని కేంద్ర ప్రభుత్వం నేరంగా మార్చకపోవడంపై అత్యున్నత ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది? భర్త మైనర్‌ భార్యపై లైంగిక దాడికి పాల్పడటాన్ని ప్రపంచవ్యాప్తంగా నీచమైన పనిగా పరిగణిస్తున్న రోజుల్లో  ఈ నేరాన్ని పార్లమెంటును ఒప్పించటం ద్వారా చట్టబద్ధం చేయడానికి ప్రభుత్వం యత్నించింది’ అని జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం తెలిపింది. మరోవైపు పోస్కో చట్టం ప్రకారం పెళ్లయిన మైనర్‌ బాలికలపై వారి భర్తల అత్యాచారాన్ని ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోంది అని గుర్తుచేసింది. వివాహమైన అనంతరం 15 నుంచి 18 ఏళ్ల లోపున్న బాలికలు అంగీకారంతో లేదా తప్పనిసరి పరిస్థితుల్లో శృంగారంలో పాల్గొంటారని కేంద్రం చేసిన వాదనలను సుప్రీం తిరస్కరించింది.

‘కేంద్రం ఇచ్చిన సమాధానం చట్ట ప్రకారం అంగీకరించేదిగా లేదు. బాలికలు, చట్టబద్ధంగా, కచ్చితంగా శృంగారంలో పాల్గొనే వయసును 18 ఏళ్లుగా నిర్ణయమైనప్పుడు, ఎలాంటి చట్టం కూడా దీన్ని మార్చలేదు’ అని జస్టిస్‌ లోకూర్‌ తన 70 పేజీల తీర్పులో పేర్కొన్నారు. వివాహం సాంప్రదాయబద్ధమని, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే వివాహ వ్యవస్థే కుప్పకూలుతుందన్న కేంద్రం వాదనల్ని జస్టిస్‌ గుప్తా తిరస్కరించారు. ‘భారత ప్రభుత్వం లేవనెత్తిన వాదనలతో నేను ఏకీభవించటం లేదు. చాలాకాలంగా కొనసాగుతోందన్న కారణంతో నేరాన్ని చట్టబద్ధం చేసే అవకాశం లేదు’ అని జస్టిస్‌ గుప్తా తన 57 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. వివాహమైన 18 ఏళ్ల బాలిక అనుభవించే మానసిక క్షోభను కేంద్రం పరిశీలించాలన్న ధర్మాసనం.. 2వ మినహాయింపుతో ఐపీసీ సెక్షన్‌ 375 మరింత నిరంకుశంగా, వివక్షాపూరితంగా తయారయిందని విమర్శించింది.

Advertisement
Advertisement