నటరాజ్‌ సింగిల్‌గానే వెళ్తాడు...

Robbery Gang Arrest in Hyderabad - Sakshi

ఘరానా దొంగ ఆటకట్టించిన రాచకొండ పోలీసులు

మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో 47 ఇళ్లలో చోరీలు

రూ.75 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: రాచకొండలో మూడేళ్లుగా ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఘరానా దొంగను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడ వీఎన్‌ఎస్‌ హోమ్స్‌ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వేముల నటరాజ్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు.  నటరాజ్‌తో పాటు చోరీసొత్తును విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఆటో డ్రైవర్‌ నుంచి దొంగగా...
పశ్చిమ గోదావరి జిల్లా, తంగెళ్లముడి మండలం, చిన్నమల్లపల్లి గ్రామానికి చెందిన వేముల నటరాజ్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటుపడిన అతను ఆటో నడపడం వల్ల వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో చోరీల బాట పట్టాడు. పశ్చిమ గోదావరిలో ఏకంగా 16 ఇళ్లల్లో చోరీలు చేశాడు. అక్కడి పోలీసులకు చిక్కడంతో రూటుమార్చిన అతను కొంతకాలంపాటు అయుర్వేద వ్యాపారం చేశాడు. అయితే అందులో వచ్చే ఆదాయం జల్సాల సరిపోకపోవడం, అక్కడి పోలీసుల నిఘా ఉండటంతో 2016లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉంటున్న  స్నేహితుడు రాజశేఖర్‌ సహాయంతో అక్కడే ఇళ్లు అద్దెకు తీసుకున్నాడు. తాను చోరీ చేసి తెచ్చే బంగారాన్ని అమ్మిపెట్టేలా రాజశేఖర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అతను బంగారు నగలు విక్రయించే వారితో కలిసి ముఠాగా ఏర్పాటు చేశారు. నటరాజ్‌ ఒంటరిగానే చోరీలు చేసేవాడు. ఉదయం వేళల్లో రెక్కీ నిర్వహించే అతను రాత్రిళ్లు టూల్‌ కిట్, టార్చ్‌లైట్, ఇనుప రాడ్‌లతో సింగిల్‌గానే వెళ్లి ఇళ్ల తాళాలు పగులగొట్టి నగలు, నగదుతో పరారయ్యేవాడు. ఇలా 2016 జనవరి నుంచి 2019 వరకు 47 చోరీలు చేశాడు.

కుషాయిగూడ డివిజన్‌లోని జవహర్‌ నగర్‌ ఠాణా పరిధిలో 23, కుషాయిగూడ ఠాణా పరిధిలో 13, కీసర ఠాణా పరిధిలో 10 చోరీలకు పాల్పడ్డాడు. దీనిని సవాల్‌గా తీసుకున్న పోలీసులు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మార్గదర్శనంలో కుషాయిగూడ ఏసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సంక్రాంతి పండుగ పూట ఊరికెళితే చెప్పాలని...ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు చేసిన ప్రచారం నటరాజును పట్టుకునేందుకు ఉపయోగపడింది. జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడ వీఎన్‌ఎస్‌ హోమ్స్‌ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు స్థానిక మహిళలు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లిన పెట్రోలింగ్‌ సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ‘పాపిలన్‌’ ఆధారంగా నటరాజ్‌ వేలిముద్రలు సేకరించడంతో కీసర ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో దొరికి వేలిముద్రలతో సరిపోలింది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా కుషాయిగూడ డివిజన్‌లో 47 చోరీలు చేసినట్లు అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారం ఆధారంగా సొత్తును విక్రయించేందుకు సహకరించిన  రాజశేఖర్, వడ్ల కృష్ణచారి, రాయరాపు నరేశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి ఇంట్లో నుంచి రూ.75 లక్షల విలువైన రెండు కిలోల 10 తులాల బంగారు ఆభరణాలు, ఏడున్నర కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు విక్రయిం చేందుకుసహకరిస్తున్న మరో ముగ్గురి కోసం  గాలిస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top