ఖైదీకి.. వైద్యం పేరుతో రాజభోగం

Prison Officials are Co operated To Remand prisoner In Nandyal - Sakshi

జడ్జికి సమాచారం ఇవ్వకుండా ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు 

జడ్జి తనిఖీతో విషయం వెలుగులోకి

పోలీస్, సబ్‌జైల్‌ సిబ్బంది, డాక్టర్లపై జడ్జి ఆగ్రహం 

సాక్షి, నంద్యాల: సబ్‌జైల్లో ఉండాల్సిన రిమాండ్‌ ఖైదీ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ కూడా వైద్యం పేరుతో రాజభోగం అనుభవిస్తుండటం చూసి జడ్జి ఆశ్చర్యపోయారు. బుధవారం నంద్యాలలో ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ లావణ్య జైల్‌ ఆకస్మిక తనిఖీతో వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 

చీటింగ్‌ కేసులో నిందితుడు.. 
అనంతపురం జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన సురేష్‌ నంద్యాల పట్టణంలో ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీకి మెటీరియల్‌ అందజేసేందుకు ఫ్యాక్టరీ యజమాని సుజల నుంచి రూ.20 లక్షలు తీసుకున్నాడు. సమయానికి మెటీరియల్‌ సప్లై చేయకపోగా, డబ్బు తిరిగి చెల్లించకపోవటంతో సుజల స్థానిక త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు ఈనెల 23న అరెస్ట్‌ చేసి ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ లావణ్య ఎదుట హాజరుపరిచారు. నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధిస్తున్నట్లు మెజిస్ట్రేట్‌ లావణ్య తీర్పు చెప్పడంతో పోలీసులు రిమాండ్‌ ఖైదీని సబ్‌జైల్‌కు తరలించారు.  

తనిఖీల్లో బయటపడిన జైల్‌ అధికారుల బాగోతం.. 
ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ లావణ్య బుధవారం సబ్‌జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌జైల్‌లో ఉండాల్సిన రిమాండ్‌ ఖైదీ సురేష్‌ కనిపించకపోవటంతో సిబ్బందిని ప్రశ్నించారు. కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు జైల్‌ సూపరింటెండెంట్‌ నరసింహారెడ్డి సమాధానం ఇచ్చారు. అనుమానంతో జడ్జి లావణ్య త్రీటౌన్‌ సీఐ శివశంకర్‌తో కలిసి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు.

ఐసీయూలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏసీ గదిలో రిమాండ్‌ ఖైదీ నిద్రపోతుండటం,  అతడికి ఇద్దరు త్రీటౌన్‌ పోలీసులు సెక్యూరిటీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. కోర్టు అనుమతి లేకుండా రిమాండ్‌ ఖైదీని ఐసీయూలోని ప్రత్యేక గదికి తరలించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఎవరి అనుమతితో ఖెదీకి 26 గంటలు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారని వైద్యులను ప్రశ్నించారు. రిమాండ్‌ ఖైదీని వెంటనే సబ్‌జైల్‌కు తరలించాలని ఆదేశించారు.   డీజీపీకి ఫోన్‌ చేసి జైల్‌ అధికారులపై ఫిర్యాదు చేశారు.

డీఎస్పీ విచారణ 
సబ్‌జైల్‌ అధికారులు చికిత్స పేరుతో కోర్టు అనుమతి లేకుండా రిమాండ్‌ ఖైదీని ఆస్పత్రికి తరలించిన ఘటనపై నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి విచారణ చేపట్టారు. కోర్టు అనుమతి లేకుండా సబ్‌జైల్‌ అధికారులు రిమాండ్‌ ఖైదీని ఆస్పత్రికి తరలించటంతో జడ్జి లావణ్య డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఎస్పీ చిదానందరెడ్డి ఆస్పత్రికి చేరుకొని అక్కడి సిబ్బందిని విచారించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అనంతరం సబ్‌జైల్‌ సిబ్బందిని విచారించారు. రిమాండ్‌ ఖైదీ సురేష్‌ను ఎలాంటి పరిస్థితిలో ఆస్పత్రికి తరలించారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

చదవండి : నవ వధువు ఆత్మహత్య 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top