‘అందుకే నా బిడ్డను చంపేశా’

Mother Strangles 8 Month Old Son In Noida - Sakshi

ఎనిమిది నెలల కొడుకును హతమార్చిన తల్లి

న్యూఢిల్లీ : భర్త అనుమానిస్తున్నాడనే బాధ, బిడ్డ ఆకలి తీర్చలేననే వేదనతో ఓ తల్లి తన నెలల పాపాయిని కడతేర్చింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో చిన్నారి మృతదేహానికి ఆవు పేడ పూసి ఇంట్లోనే ఉంచింది. ఈ అమానుష ఘటన గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాలు... హేమ(26) అనే మహిళ తన భర్త రోతాష్‌తో కలిసి గోపాల్‌ఘర్‌ గ్రామంలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. బిడ్డ తనకు పుట్టలేదని, తన అన్న సంతానం అంటూ రోతాష్‌ హేమను నిందించేవాడు. రోతాష్‌ తండ్రి కూడా అతడికే మద్దతు పలకడంతో హేమపై ఒత్తిడి పెరిగింది. భర్త, మామ ప్రవర్తనతో విసిగిపోయిన హేమ బిడ్డను పట్టించుకోవడం మానేసింది. 

ఈ క్రమంలో గత బుధవారం పాల కోసం ఏడుస్తున్న కొడుకును గొంతు నులిమి, చున్నీతో ఉరి బిగించి చంపేసింది. అనంతరం శవానికి ఆవు పేడ పూసి భద్రపరిచింది. అయితే హేమ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ నేపథ్యంలో హేమ ఇంటికి చేరుకున్న పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మగబిడ్డ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. హేమ, ఆమె భర్త, మామలను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. బిడ్డ పుట్టిన నాటి నుంచి భర్త తనను వేధించేవాడని, అనుమానంతో చిత్ర హింసలకు గురిచేసేవాడని హేమ పోలీసుల ఎదుట వాపోయింది. తనకు, బిడ్డ పోషణకు డబ్బులు ఇచ్చేవాడు కాదని, భవిష్యత్తులో బిడ్డను పెంచలేననే వేదనతోనే తాను హత్య చేశానని నేరం అంగీకరించింది. ఈ క్రమంలో హేమతో పాటు ఆమె భర్త, మామలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top