ఇద్దరు బిడ్డలను చంపిన తల్లి  | Mother Kills Her Two Childrens In Siddipet | Sakshi
Sakshi News home page

ఇద్దరు బిడ్డలను చంపిన తల్లి 

May 26 2019 2:03 AM | Updated on May 26 2019 5:31 AM

Mother Kills Her Two Childrens In Siddipet - Sakshi

ఇద్దరు పిల్లలతో తల్లి సరోజ(ఫైల్‌)

సిద్దిపేట కమాన్‌: నవమాసాలు మోసి.. జన్మనిచ్చిన తల్లే తన బిడ్డల ప్రాణాలను బలితీసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మాతృమూర్తి తన కొడుకుల నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసా, కత్తితో పేగులు బయటకు వచ్చేలా కడుపులో పొడిచి అత్యంత పాశవికంగా అంతమొందించింది. అనంతరం కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది.

శనివారం సిద్దిపేట పట్టణంలోని గణేశ్‌నగర్‌లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల భాస్కర్, సరోజ ఆరున్నర సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన కొత్తలో కొన్నాళ్ల పాటు వీరు కరీంనగర్‌లో ఉన్నారు. వీరికి ఆయాన్‌ (బిట్టు) (5), హర్షవర్ధన్‌(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దికాలం తర్వాత ఈ దంపతులు సిద్దిపేట పట్టణానికి వచ్చి గణేశ్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.

భాస్కర్‌ కార్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, భాస్కర్‌కు ఇది రెండో పెళ్లి. మొదటి భార్య, భాస్కర్‌పై రెండో పెళ్లి చేసుకున్నాడని కేసు పెట్టడంతో కొద్ది సంవత్సరాలు వాదోపవాదనలు జరిగిన అనంతరం ఈ మధ్య భాస్కర్‌కు కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. భాస్కర్, సరోజకు ఇదే విషయంలో గత కొద్ది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భాస్కర్‌ ఇంట్లో లేని సమయంలో శనివారం మధ్యాహ్నం సరోజ తన ఇద్దరు పిల్లలను బీరు సీసా, కత్తితో అత్యంత దారుణంగా కడుపులో పొడిచి చంపింది.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రామేశ్వర్, వన్‌ టౌన్‌ సీఐ నందీశ్వర్‌రెడ్డి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిల్లల తండ్రి భాస్కర్‌ మృతదేహాలను చూసి భోరున విలపించాడు. కాగా, కొడుకులను చంపి సరోజ కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ ఘటనపై సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement