ఆవును రక్షించబోయి...

Man Died In A Canal Vizianagaram - Sakshi

బందలో దిగి యువకుడి మృతి

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

శృంగవరపుకోట రూరల్‌ : బందలో నీరు తాగేందుకు దిగిన (మెడకు, కాలికి తాడుతో కట్టేసి ఉన్న ఆవు) ఆవును రక్షించబోయి కరెడ్ల రామ శివకేశ (25) అనే యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందిన సంఘటన మండలంలోని వెంకటరమణపేటలో  శుక్రవారం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదానికి సంబంధించి మృతుడి తండ్రి వెంకటరమణ, మామయ్య కనిశెట్టి ఈశ్వరరావు తెలియజేసిన వివరాల ప్రకారం..లక్కవరపుకోట మండలం పిల్లాగ్రహారానికి చెందిన కరెడ్ల రామ శివకేశ ఎస్‌.కోట మండలం వెంకటరమణపేటలో ఉన్న తన మేనత్త సత్యవతి ఇంటికి చుట్టపు చూపుగా కొద్ది రోజుల కిందట వచ్చాడు.

మేనత్తకు చెందిన ఆవులను వెంకటరమణపేట జంక్షన్‌కు ఎదురుగా ఉన్న తిమిడి రోడ్డు వైపు మేతకు తీసుకెళ్లాడు. ఇందులో ఒక ఆవు (కాలుకు మెడకు తాడుతో కట్టి ఉన్నది) దాహార్తిని తీర్చుకునేందుకు సమీపంలో ఉన్న బండి కన్నయ్యగారి బందలో దిగింది.

అయితే కాలికి, మెడకు తాడు కట్టి ఉండడంతో గట్టు ఎక్కడానికి అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఆవును రక్షించడానికి రామ శివకేశ బందలో దిగి ఆవును తోలుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు.

సమీపంలో ఉన్న రైతులు గమనించి బందలో మునిగిన రామశివను బయటకు తీసి వారి బంధువుల సహకారంతో ఎస్‌.కోటలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రామ శివకేశ మృతి చెందినట్లు డాక్టర్‌ ఆర్‌. త్రినాథరావు తెలిపారు.

ఇటీవల కురిసిన వర్షాలకు బందనిండా నీరు చేరిందని.. రామశివకు ఈతరానందునే ప్రమాదవశాత్తూ నీట మునిగిపోయాడని స్థానికులు తెలిపారు. మృతుడికి వివాహం జరిగినప్పటికీ భార్య వదిలేసిందని, తల్లికూడా మరణించిందని బంధువులు తెలిపారు.

అందరితో కలిసిమెలసి ఉంటూ అప్యాయంగా పలకరించే రామశివ ఇకలేడంటు మృతుని మేనత్త సత్యవతి, మావయ్య కనిశెట్టి ఈశ్వరరావు, తండ్రి వెంకటరమణ, బంధువులు బోరున విలపించారు. మృతుని తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్‌.అమ్మినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top