అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా... | Kolkata Student Stabs Junior Over Seat Beside Girl Argument In School Bus | Sakshi
Sakshi News home page

అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా...

Jul 10 2018 1:31 PM | Updated on Jul 10 2018 1:52 PM

Kolkata Student Stabs Junior Over Seat Beside Girl Argument In School Bus - Sakshi

అమ్మాయి పక్కన సీటు కోసం జూనియర్‌పై కత్తితో దాడి

కోల్‌కతా : సినిమాల్లో చూపించే మాదిరిగా ఓ ఇద్దరు విద్యార్థులు స్కూల్‌ బస్సులో అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా కొట్టుకున్నారు. ఇక సీనియర్‌ విద్యార్థి అయితే ఏకంగా జూనియర్‌ విద్యార్థిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. సీనియర్‌ విద్యార్థి దాడిలో తీవ్ర గాయాలు పాలైన జూనియర్‌ వెనువెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

అసలేం జరిగింది.. సాయంత్రం 4.45కు స్కూల్‌ అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ తమ ఇళ్లకు వెళ్లడానికి స్కూల్‌ బస్సు ఎక్కారు. క్లాస్‌ 11 విద్యార్థి అమ్మాయి పక్కన సీటులో కూర్చోవాలనుకున్నాడు. కానీ ఆమె పక్కన ఉన్న సీటులో క్లాస్‌ 10 విద్యార్థి కూర్చున్నాడు. అయితే ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్‌ అని వెంటనే ఆ సీటులోంచి లేచి వేరే సీటులో కూర్చోవాలని జూనియర్‌ విద్యార్థిని సీనియర్‌ విద్యార్థి బెదిరించాడు. కానీ సీనియర్‌ బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గని జూనియర్‌, సీటును ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి తీవ్ర స్థాయిగా మారింది.

వారిద్దరి మధ్య తగాదాను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఆ సమయంలోనే స్కూల్‌ గేట్‌ నుంచి బస్సు కూడా ప్రారంభమైంది. పలుమార్లు డ్రైవర్‌ చెప్పినప్పటికీ, ఆ ఇద్దరు మాత్రం తమ వాగ్వాదాన్ని పెంచుకుంటూ పోయారు తప్ప తగ్గించలేదు. ఈ క్రమంలో బస్సును మధ్యలో ఆపిన సీనియర్‌, రోడ్డు పక్కనే ఉన్న స్టాల్‌లో కత్తిని తీసుకుని జూనియర్‌పై దాడికి పాల్పడ్డాడు. మెడ, భుజంపై పలు గాడ్లు పెట్టాడు. బస్సు డ్రైవర్‌, హెల్పర్‌, ఇతర విద్యార్థులు సీనియర్‌ విద్యార్థిని అడ్డుకుని, జూనియర్‌ను కాపాడారు. వెంటనే గాయపడిన జూనియర్‌ను కోల్‌కతాలోని దమ్‌ దమ్‌ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన సీనియర్‌ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement