breaking news
Kolkata student
-
అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా...
కోల్‌కతా : సినిమాల్లో చూపించే మాదిరిగా ఓ ఇద్దరు విద్యార్థులు స్కూల్ బస్సులో అమ్మాయి పక్కన సీటు కోసం రక్తమొచ్చేలా కొట్టుకున్నారు. ఇక సీనియర్ విద్యార్థి అయితే ఏకంగా జూనియర్ విద్యార్థిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. సీనియర్ విద్యార్థి దాడిలో తీవ్ర గాయాలు పాలైన జూనియర్ వెనువెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అసలేం జరిగింది.. సాయంత్రం 4.45కు స్కూల్ అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ తమ ఇళ్లకు వెళ్లడానికి స్కూల్ బస్సు ఎక్కారు. క్లాస్ 11 విద్యార్థి అమ్మాయి పక్కన సీటులో కూర్చోవాలనుకున్నాడు. కానీ ఆమె పక్కన ఉన్న సీటులో క్లాస్ 10 విద్యార్థి కూర్చున్నాడు. అయితే ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్ అని వెంటనే ఆ సీటులోంచి లేచి వేరే సీటులో కూర్చోవాలని జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బెదిరించాడు. కానీ సీనియర్ బెదిరింపులకు ఏ మాత్రం తలొగ్గని జూనియర్, సీటును ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఆ ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ గొడవ చిలికి చిలికి తీవ్ర స్థాయిగా మారింది. వారిద్దరి మధ్య తగాదాను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేదు. ఆ సమయంలోనే స్కూల్ గేట్ నుంచి బస్సు కూడా ప్రారంభమైంది. పలుమార్లు డ్రైవర్ చెప్పినప్పటికీ, ఆ ఇద్దరు మాత్రం తమ వాగ్వాదాన్ని పెంచుకుంటూ పోయారు తప్ప తగ్గించలేదు. ఈ క్రమంలో బస్సును మధ్యలో ఆపిన సీనియర్, రోడ్డు పక్కనే ఉన్న స్టాల్లో కత్తిని తీసుకుని జూనియర్‌పై దాడికి పాల్పడ్డాడు. మెడ, భుజంపై పలు గాడ్లు పెట్టాడు. బస్సు డ్రైవర్, హెల్పర్, ఇతర విద్యార్థులు సీనియర్ విద్యార్థిని అడ్డుకుని, జూనియర్‌ను కాపాడారు. వెంటనే గాయపడిన జూనియర్‌ను కోల్‌కతాలోని దమ్ దమ్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన సీనియర్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విహారయాత్రకు వెళ్లిన విద్యార్థినిపై దారుణం
కోల్‌కతా: సిక్కింకు విహారయాత్రకు వెళ్లిన కోల్‌కతాకు చెందిన విద్యార్థినిపై టాక్సీ డ్రైవర్ అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడు ప్రేమ్‌రాజ్‌తో పాటు అతని స్నేహితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత ఈ నెల 13న కోల్‌కతాకు చెందిన ముగ్గురు విద్యార్థినులు విహారయాత్రకు సిక్కిం వెళ్లారు. గ్యాంగ్ టక్లో బంధువుల హోటల్లో బస చేశారు. గ్యాంగ్‌టక్ చుట్టుపక్కల ఉన్న విహారప్రదేశాలను చూసేందుకు వారు ముగ్గురు ఓ టాక్సీ మాట్లాడుకున్నారు. కొన్ని ప్రదేశాలు చూసిన తర్వాత డ్రైవర్ వారికి చిప్స్, నీళ్లు అందించాడు. ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి వాటిని తీసుకోగా, వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరు అమ్మాయిలు తినలేదు. చిప్స్ తిన్న తర్వాత ఆ అమ్మాయికి మత్తురావడంతో డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు అమ్మాయిలు డ్రైవర్‌ను నిలదీశారు. డ్రైవర్ వారిద్దరినీ కారులోంచి తోసివేసి, మత్తులో ఉన్న అమ్మాయిని తీసుకుపోయాడు. ఇద్దరు అమ్మాయిలు రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి గ్రామస్తులకు ఈ విషయం చెప్పారు. విద్యార్థినులు బస చేసిన హోటల్ యజమానికి ఫోన్ చేసి చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు స్థానికుల సాయంతో గాలించి నిందితుడిని అరెస్ట్ చేసి, బాధితురాలిని కాపాడారు. విద్యార్థిని ముఖం, మెడపై గాయాలయ్యాయని, ఆమె షాక్‌లో ఉందని స్థానికులు చెప్పారు.