రాకేష్‌ రెడ్డిపై పీడీ యాక్ట్‌

Jublihills police opens PD act on Rakesh - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త, కోస్టల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ చిగురుపాటి జయరామ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. జయరాం హత్యతోపాటు నగరంలో గత మూడేళ్లుగా బెదిరింపులు, భూకబ్జాలకు పాల్పడటంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు పీడీయాక్ట్‌ అమలు చేశారు. పీడీ యాక్ట్‌కు సంబంధించి అన్ని కేసుల వివరాలు, శాస్త్రీయ ఆధారాలు ప్రతిపాదిత నివేదికలో జతపర్చారు.

ఇటీవలే రాకేశ్‌రెడ్డితోపాటు మరో ఏడుగురు నిందితులపై పోలీసులు నాంపల్లిలోని 17వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 70 మంది సాక్షులను విచారించిన పోలీసులు 388 పేజీల చార్జిషీట్‌ రూపొందించారు. శాస్త్రీయ ఆధారాలతోపాటు ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నుంచి సేకరించిన రిపోర్టును కూడా చార్జిషీట్‌తోపాటు జతపర్చారు. రాకేశ్‌రెడ్డితోపాటు ఆధారాలు తారుమారు చేసేందుకు సహకరించిన ఆయన అనుచరులు శ్రీనివాస్, సినీ నటుడు సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నాగేశ్, అంజిరెడ్డి, సుభాష్‌రెడ్డిలపై చార్జిషీట్‌ దాఖలైంది. ఈ ఏడాది జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి హనీట్రాప్‌ చేసిన రాకేశ్‌రెడ్డి రోడ్‌ నం.10లోని తన ఇంటికి రప్పించి 31వ తేదీన ఉదయం 11.30 గంటలకు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

ఆధారాలు తారుమారు చేసి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా చిత్రీకరించే నిమిత్తం ముగ్గురు పోలీసు అధికారుల సలహాలు తీసుకొని జయరాం కారులోనే హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో నందిగామ శివార్లకు చేరుకున్నాడు. మృతదేహాన్ని అక్కడే పడేసి బస్సులో అదే రాత్రి జూబ్లీహిల్స్‌కు వచ్చి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం కుత్బుల్లాపూర్‌ చింతల్‌లోని తన ఇంటికి వెళ్లాడు. పక్కా ఆధారాలు సేకరించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని ఫిబ్రవరి 7న అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత సమాచారం, పురోగతి కోసం ఫిబ్రవరి 13 నుంచి 26వ తేదీ వరకు రాకేశ్‌రెడ్డిని కస్టడీకి తీసుకొని సమాచారాన్ని క్రోడీకరించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాకేష్‌ రెడ్డిపై పీడీయాక్ట్‌ నమోదుతో మరో ఏడాదిపాటూ జైల్లోనే ఉండనున్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top