దవాఖానాల్లో ‘దొంగలు’!

Inter State Thief Gangs Arrest in Drugs Smuggling Case - Sakshi

వారి ద్వారానే బయటకు వస్తున్న ‘కోవిడ్‌’ ఔషధాలు

యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ దందాపై నిఘా ముమ్మరం

వరుస దాడులు చేస్తున్న సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

ఇప్పటికే ఐదు గ్యాంగ్స్‌ను పట్టుకున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 వైరస్‌ విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి యాంటీ వైరల్‌ డ్రగ్స్‌కు భారీ డిమాండ్‌ వచ్చింది. దీన్ని క్యాష్‌ చేసుకోవడానికి అనేక ముఠాలు రంగంలోకి దిగాయి. స్థానిక గ్యాంగ్స్‌తో పాటు అంతరాష్ట్ర ముఠాలు వ్యవస్థీకృతంగా దందా చేస్తున్నాయి. ప్రధానంగా రెమిడెసివీర్, ఆక్టెమ్రా, ఫాబి ఫ్లూ వంటి యాంటీ వైరల్‌ ఔషధాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలుతున్నాయి. పరిస్థితి విషమంగా ఉన్న కోవిడ్‌ రోగుల చికిత్సలో వీటిని వినియోగిస్తుండటంతో గతంలో ఎన్నడూలేని విధంగా వీటి ప్రాధాన్యం పెరిగింది. ఈ గ్యాంగ్స్‌ రకరకాలుగా ఈ యాంటీ వైరస్‌ ఔషధాలను సంగ్రహిస్తున్నాయి. ప్రధానంగా ‘దొంగతనాల’ ద్వారానే ఈ డ్రగ్స్‌ బయటకు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. నగరంలోని వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బంది, ఫార్మసిస్టులు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ ఔషధాలను నేరుగా ఆస్పత్రులకే విక్రయించాల్సి ఉన్నా... అడ్డదారిలో బ్లాక్‌ మార్కెట్‌ చేస్తూ ఈ గ్యాంగ్‌ రోగుల్ని ముంచుతోంది. కొందరు ఆస్పత్రి ఉద్యోగులు మెడికల్‌ షాపులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని కథ నడిపిస్తున్నారు. (యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ సీటీస్కాన్లో పాజిటివ్)

సంగారెడ్డిలో ఉన్న హెటిరో, గోవా కేంద్రంగా పని చేస్తున్న సిప్లా సంస్థలు మాత్రమే ఈ యాంటీ వైరల్‌ ఔషధాలను తయారు చేస్తున్నాయి. హెటిరో సంస్థ తమ రెమిడెసిమీర్‌ ఇంజెక్షన్‌ను రూ.5400, సిప్లా సంస్థ తాము తయారు చేస్తున్న సిప్రెమీ ఇంజెక్షన్‌ను రూ. 4000కు విక్రయిస్తున్నాయి. వీటిని డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కేవలం ఆస్పత్రులకు మాత్రమే అమ్మాల్సి ఉంది. అమెరికాలో తయారవుతున్న ఫాబి ఫ్లూ టాబ్లెట్స్‌ సైతం కోవిడ్‌ రోగులకు వినియోగిస్తున్నారు. ఇది ఒక్కో స్ట్రిప్‌ రూ. 3500కు విక్రయిస్తోంది. ఈ ఔషధాలను రోగులకు విక్రయించాలంటే భారీ తతంగమే ఉంటుంది. రోగి ఆధార్‌ కార్డు ప్రతి, కరోనా పాజిటివ్‌ రిపోర్ట్, వైద్యులు రాసిన చీటీలతో పాటు రోగి కన్సంట్‌ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ దాఖలు చేసిన తర్వాత రోగికి అసరమైన మేరకు ఈ ఔషధాలను అందిస్తున్నారు. వినియో గించగా మిగిలిన డోసుల్ని తిరిగి ఇవ్వాలనే నిబంధన ఉన్నా అమలు కాదు. కొందరు రోగులకు సగం డోసులు ఇచ్చిన తర్వాత వారు కోలుకుంటూ ఉంటారు. (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే )

మిగిలిన డోసుల్ని ఆయా ఆస్పత్రుల్లో పని చేసే ఉద్యోగులు, ఫార్మసిస్టులు చోరీ చేస్తున్నారు. ఔషధాలు వినియోగిస్తూ, అసలు వాడకుండానే రోగులు మరణిస్తే ఆ డ్రగ్స్‌ను స్వాహా చేసి మెడికల్‌ షాపుల ద్వారా లేదా దళారుల సహకారంతో అవసరమైన రోగులకు అమ్ముతున్నారు. రూ. 5,400 ఖరీదు చేసే రెమిడెసివీర్‌ గరిష్టంగా రూ. 40 వేలకు, రూ. 40 వేలు ఖరీదు చేసే ఆక్టెమ్రా రూ. లక్షకు, రూ. 3500 ఖరీదు చేసే ఫాబిఫ్లూ రూ. 5 వేలకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారంపై ఇటు పోలీసులతో పాటు అటు ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ అధికారులు ఇలాంటి గ్యాంగ్స్‌పై నిఘా ముమ్మరం చేశాయి. ఫలితంగా గడిచిన పది రోజుల్లో ఐదు ముఠాలు చిక్కాయి. వీరిలో అత్యధికులు దవాఖానా ఉద్యోగులు, మెడికల్‌ షాపుల నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్లు ఉండటం గమనార్హం.

ఇటీవల చిక్కిన ‘డ్రగ్స్‌’ ముఠాలివీ..
దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత మంగళవారం ఎనిమిది మంది సభ్యులతో కూడిన అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 35 లక్షల విలువైన యాంటీ వైరస్‌ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో నలుగురు ఔషధ విక్రయ రంగంలో ఉన్న వారే.  
ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం ఇద్దరిని అరెస్టు చేసి రూ. 5.6 లక్షల విలువైన రెమిడెసిమీర్‌ ఇంజెక్షన్లు, ఫాబి ఫ్లూ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అన్నదమ్ములైన ఈ ద్వయం చిలకలగూడ, రామ్‌గోపాల్‌పేటల్లో మెడికల్‌ షాపులు నిర్వహిస్తున్నారు.
పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి తొమ్మిది రెమిడెసిమీర్, ఒక సిప్రెమీ ఇంజెక్షన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడుగురిలో ఆరుగురు నగరంలోని మూడు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారే.  
ఆదివారం తూర్పు మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. నగరంలోని ఓ మెడికల్‌ షాపు, మరో దవాఖానాలో పని చేస్తున్న వీళ్లు రెమిడెసివీర్‌ ఇంజెక్షన్‌ను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.    
సోమవారం మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ పోలీసులు రెమిడెసివీర్‌ ఇంజెక్షన్లు, ఫావిపిరవిర్‌ అనే మాత్రలను అధిక ధరలకు అమ్ముతున్న నలుగురిని అరెస్టు చేశారు. కుషాయిగూడలోని ఓ మెడికల్‌ షాపు కేంద్రంగా ఈ దందా సాగుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top