మాజీ భార్యను హత్య చేసిన భర్త! | Husband who murdered ex-wife | Sakshi
Sakshi News home page

మాజీ భార్యను హత్య చేసిన భర్త!

Dec 31 2017 2:57 AM | Updated on Jul 30 2018 8:37 PM

Husband who murdered ex-wife - Sakshi

భీమ్లానాయక్‌ మృతదేహం

నవాబుపేట/రాజాపూర్‌(జడ్చర్ల): ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతులు విడాకులు తీసుకున్నారు. భరణం చెల్లించే విషయంలో కోర్టులో కలుసుకున్నారు. ఒకే వాహనంపై వెళ్లే క్రమంలో వారు గొడవ పడ్డారు. దీంతో ఆమెను హత్య చేశాడు ఆ మాజీ భర్త. హత్య చేసిన కొద్ది గంటల్లోనే రోడ్డు ప్రమాదంలో అతడు కూడా మరణించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో శనివారం వెలుగు చూసింది. నవాబుపేట మండలం కొల్లాపూర్‌ రంగయ్యబావి తండాకు చెందిన భీమ్లానాయక్‌ (38)కు 15 ఏళ్ల క్రితం తిమ్మాజిపేట మండలం పుల్లగిరితండాకు చెందిన విజయలక్ష్మి (35) ప్రేమపెళ్లి చేసుకున్నారు. భీమ్లానాయక్‌కు ఉద్యోగం లేకపోవడం, విజయలక్ష్మికి సంతానం కలగకపోవడంతో గొడవలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్‌లోని తన సోదరుడి వద్ద ఉంటోంది.

అనంతరం భీమ్లా బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో విజయలక్ష్మి కోర్టుకు వెళ్లగా నెలనెలా భరణం చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే, రెండు నెలలుగా భరణం చెల్లించకపోవడంతో ఆమె మళ్లీ కోర్టుకు వెళ్లింది. ఈ విషయంపై గురువారం వీరు మహబూబ్‌నగర్‌ కోర్టుకు హాజరయ్యారు. ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌లో దిగబెడతానని భీమ్లా ఆమెను నమ్మించి తీసుకువెళ్లాడు. రాజాపూర్‌ మండలం రంగారెడ్డిగూడ వద్ద ఇద్దరు మద్యం తాగి గొడవపడ్డారు. భీమ్లా ఆమెను హత్య చేసి పెట్రోల్‌ పోసి దహనం చేశాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆర్‌సీపూర్‌తండా మలుపు దగ్గర విద్యుత్‌ స్తంభానికి ఢీకొని మృతి చెందాడు. ఇంతలో విజయలక్ష్మి తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. ఆమె సెల్‌ఫోన్, పర్సు భీమ్లా మృతదేహం దగ్గర దొరకడంతో ఆయనే హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement