మత మార్పిడికి విముఖత: కోడలిపై ఘాతుకం

Hindu girl gang-raped by father-in-law - Sakshi

సాక్షి, రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇస్లాం మతం స్వీకరించేందుకు నిరాకరించిన హిందూ యువతిపై స్వయాన మామ, బంధువులు లైంగికదాడి చేసి హతమార్చారు.రామ్‌గర్‌ జిల్లాలో దాదాపు నెలరోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నవంబర్‌ 6 నుంచి అదృశ్యమైన బాధితురాలి మృతదేహాన్ని గర్నా నది ఒడ్డున కనుగొన్నారు. పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో బాధితురాలిని హత్య చేసే ముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని వెల్లడైంది. యువతి ప్రేమికుడు అదిల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి నుంచి పలు వివరాలు రాబట్టారు.

గత నెలలో తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా బాధిత యువతి అదిల్‌ను వివాహం చేసుకుంది. అనంతరం బొకారోలోని అదిల్‌ అంకుల్‌ ఇంటికి కొత్త దంపతులు చేరుకున్నారు. దీంతో ఆయన అదిల్‌ తండ్రికి సమాచారం అందించి అక్కడికి రప్పించారు. యువతి వేరే మతస్థురాలు కావడంతో తొలుత ఇస్లాం మతం స్వీకరించాలని వారు ఆమెకు నచ్చచెప్పారు. అయితే వారి డిమాండ్‌ను ఆమె తోసిపుచ్చింది.

దీంతో వారిద్దరినీ రాంచీలో కలిసిఉండేలా చూస్తామని దగ్గరలోని రైల్వే స్టేషనకు తీసుకువెళతామంటూ అదిల్‌ తండ్రి, అంకుల్‌ నమ్మబలికి సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసి పొదల్లో పడవేశారు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనను చెట్టుకు కట్టేశారని అదిల్‌ చెప్పాడు. ఈ ఘటనపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. ఇది లవ్‌జిహాద్‌ కేసుగా పేర్కొంటూ నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top