మాజీ మావోయిస్టు ఆత్మహత్య

Former Maoist suicide - Sakshi

    ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలే కారణం

  2007లో జనజీవన స్రవంతిలోకి రమాకాంత్‌ 

లింగాల (అచ్చంపేట): కుటుంబ కలహాల వల్ల మాజీ మావోయిస్టు గుండూరు రమాకాంత్‌ అలియాస్‌ శ్రీను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం హజిలాపూర్‌కు చెందిన రమాకాంత్‌ కొన్నేళ్ల క్రితం పీపుల్స్‌వార్‌ గ్రూపు (ప్రస్తుత మావోయిస్టు)లో దళ కమాండర్‌గా, మహబూబ్‌నగర్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశాడు. అప్పట్లోనే బల్మూర్‌ మండలం కొండనాగులకు చెందిన మావోయిస్టు దేవేందరమ్మ అలియాస్‌ రజితను ఆయన వివాహం చేసుకున్నాడు.

ఆ తర్వాత దంపతులిద్దరూ 2007లో జనజీవన స్రవంతిలో కలిశారు. అప్పటి నుంచి కల్వకుర్తిలో చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఇటీవల కాలంలో కుటుంబంలో ఆర్థిక సమస్యలు, కలహాలు చోటుచేసుకోవడంతో 5 రోజుల క్రితం అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం తన భార్య అక్క ఈశ్వరమ్మ ఉంటున్న అంబట్‌పల్లికి సోమవారం వెళ్లగా రజిత అక్కడ కనిపించలేదు. దీంతో మనస్తాపానికి గురైన రమాకాంత్‌ పురుగుల మందు తాగగా స్థానికులు అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు’అని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం హజిలాపూర్‌కు తరలించి పోలీస్‌ బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. 

ఎన్నో ఘటనలు.. 
పీపుల్స్‌వార్‌లో కొనసాగిన సమయంలో రమాకాంత్‌ అనేక ఘటనల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పోలీసు స్టేషన్ల ధ్వంసం, రాజకీయ నాయకులు, ఎస్పీ హత్య ఘటనలో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. 1993లో అప్పటి ఎస్పీ పరదేశీనాయుడు, 2004లో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి హత్యతో ఆయనకు సంబంధాలున్నాయని తెలిపారు. అచ్చంపేట, అమ్రాబాద్‌ పోలీసు స్టేషన్ల పేల్చివేతలో పాలుపంచుకున్నాడని వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top