మార్కెట్‌ భస్మీపటలం

Fire Accident In Tagarapuvalasa Market Yard - Sakshi

73 షాపులు దగ్ధం

ఆకతాయిల పనిగా అనుమానం

తగరపువలస ప్రాంతంలో అతిపెద్ద ప్రైవేటు మార్కెట్‌ ఇది. కూరగాయల నుంచి అన్ని నిత్యావసర వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. రోజూ రూ.5 లక్షలకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఆశీలు రూపంలో నిర్వాహకులకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇక్కడ ఉండరు. సాయంత్రం ఆరు.. ఏడు గంటల తరువాత వ్యాపారులంతా దుకాణాలు కట్టేసి వెళ్లిపోతారు.  ఆ తరువాత ఆకతాయిలు చొరబడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి తరువాత పెద్ద ఎత్తున అగ్నికీలలు చుట్టిముట్టి సర్వం బూడిదైంది. 

సాక్షి, తగరపువలస (భీమిలి) :  ఇక్కడి  ప్రైవేట్‌ మార్కెట్‌ గురువారం అర్ధరాత్రి తరువాత  అగ్నికి ఆహుతైపోయింది. ఈ  ప్రమాదంలో 73 దుకాణాలు కాలి బూడిదైనట్టు రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం రూ. 47.29 లక్షల ఆస్తి నష్టం   నష్టం సంభంవించినట్లు ప్రాథమిక అంచనా. ఇందులో కాలిపోయిన వస్తువుల విలువే రూ.27.29 లక్షలు, షెడ్ల విలువ రూ. 20 లక్షల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెప్పారు. రాత్రి ఒంటి గంటన్నర ప్రాంతంలో మొదలైన మంటలు తెల్లవారు జామున నాలుగు గంటల వరకు ఎగిసి పడుతూనే  ఉన్నాయి. ముందుగా మెయిన్‌ రోడ్డుకు చేరువలో ఉన్న తట్టలు, చాపలు అంటుకుని ఆరు లైన్లలో ఉన్న దుకాణాలను చుట్టుముట్టడంతో అగ్నికీలలు మార్కెట్‌ను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో కాయగూరలు, ఉల్లి, ఫ్యాన్సీ, గాజులు, అరటిపండ్లు, కోడిగుడ్లు, నూనె, కిరాణా, మిర్చి, పసుపు, కుంకుమ, చీపుళ్ల దుకాణాలు కాలిపోయాయి.  ఒక్కో వ్యాపారి రూ.50వేల నుంచి రూ.5 లక్షల వరకు నష్టపోయారు. ఇది గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే చేసిన పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రెండు ఫైరింజన్లు శ్రమించినా..
ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ సిబ్బంది తాళ్లవలస అగ్నిమాపక సిబ్బందిని వెంట పెట్టుకుని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే నీరు అయిపోవడంతో నగరం నుంచి మరో ఫైరింజన్‌ను తీసుకువచ్చారు. సమయానికి నీరు అందుబాటులో లేకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు మార్కెట్‌ను మిర్చి, మసాలా కాలిన ఘాటు పొగతో నిండిపోయింది. దీంతో రెండు బాబ్‌కాట్లు, జేసీబీతో  మార్కెట్లో బూడిద తరలించడానికి అంతరాయం ఏర్పడింది.

తరచూ అగ్ని ప్రమాదాలు..
మార్కెట్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. వ్యాపారులకు సరైన గిడ్డంగి వసతులు లేకపోవడంతో దుకాణాల్లోనే సామగ్రి భద్రపరచుకుని వెళ్లిపోతుంటారు. ఆరు మండలాలకు కేంద్రంగా ఉన్న ఈ  మార్కెట్‌కు ఆశీళ్ల రూపంలో రోజుకు రూ.40 వేలు, ఆదివారం సంత సమయంలో రూ.1.50 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది.   ప్రతిరోజు రూ.2 కోట్ల విలువైన వస్తువులు ఉంటున్నా ప్రయివేట్‌ యాజమాన్యం కాపలాదారులను ఉంచకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మందుబాబులు రాత్రి 8 దాటితే మార్కెట్‌లో దుకాణాలను బార్‌లుగా మార్చేస్తుంటారు. తిని తాగి దుకాణాలపై ప్రతాపం చూపిస్తుంటారు. ఈ అగ్ని ప్రమాదానికి కూడా మందుబాబులే కారకులై ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top