నకిలీ మావోయిస్టుల అరెస్ట్‌

Fake Maoists Gang Held in Khammam - Sakshi

వీరన్న దళం పేరుతో రూ.50 లక్షల డిమాండ్‌

ముగ్గురి అరెస్ట్, రూ. రెండు లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం

సత్తుపల్లి: ఎయిర్‌ గన్, లైటర్‌ పిస్టల్‌ చూపించి మావోయిస్టు వీరన్న దళం అంటూ సింగరేణిలో కాంట్రాక్ట్‌ సంస్థ మహాలక్ష్మి క్యాంప్‌ మేనేజర్‌ను బెదిరించిన నకిలీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం సత్తుపల్లి సీఐ ఎ.రమాకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సింగరేణి ఐఎన్‌టీయూసీ నాయకురాలుగా చెప్పుకుంటున్న తాటిపాముల విజయలక్ష్మి, మెదక్‌ జిల్లా టేక్‌మాల్‌ మండలం వేల్పుగొండకు చెందిన తన కారు డ్రైవర్‌ మనోజ్‌కుమార్, అతని బావమరిది హరీష్, మరో వ్యక్తితో కలిసి వీరన్నదళం అంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్‌ మేనేజర్‌ జితేంద్రకు పలుమార్లు ఫోన్‌ చేశారు. ‘మీ క్యాంప్‌లు రామగుండంతో సహా అన్ని తెలుసు.. మాకు చందా ఇవ్వకపోతే క్యాంప్‌లను పేల్చివేస్తాం’అని బెదిరించారు.

ఈ నెల 5న ఇద్దరు వ్యక్తులు కారులో సత్తుపల్లి వచ్చి, మహాలక్ష్మి క్యాంప్‌కు వెళ్లి మేనేజర్‌ జితేంద్రను కలిసి వీరన్నదళం అంటూ పరిచయం చేసుకుని రూ.50లక్షలు డిమాండ్‌ చేశారు. కొంత సమయం కావాలని, యజమాని దృష్టికి తీసుకెళ్తానని చెప్పటంతో కొద్దిసేపు వాగ్వాదం చేసి బెదిరించి వెళ్లిపోయారు. అదేరోజు రాత్రి 11, 12 గంటల సమయంలో తుపాకులను చూపించి బెదిరించి డబ్బులు ఇప్పుడే ఇవ్వాలని ఒత్తిడి చేసి రూ.5 లక్షలు తీసుకెళ్లారు. విషయం పోలీసుల దృష్టికెళ్లడంతో వాళ్ల కదలికలు, ఫోన్‌ కాల్స్‌పై నిఘా పెట్టారు. మళ్లీ ఈ నెల 18న వచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తుండటంతో కల్లూరు ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వెంకట్రావు, సీఐ వెంకటస్వామి, ఎస్సై రఘులు వలపన్ని పట్టుకున్నారు. ప్రధాన నిందితురాలు తాటిపాముల విజయలక్ష్మిని హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, ఒక ఎయిర్‌ గన్, ఒక లైటర్‌ పిస్టల్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మనోజ్‌కుమార్, హరీష్‌లను శనివారం రాత్రి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. విజయలక్ష్మిని ఆదివారం రిమాండ్‌కు పంపుతున్నట్లు, మరో వ్యక్తి పరారీలో ఉన్నారని సీఐ రమాకాంత్, ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. నకిలీ ముఠాకు సూత్రదారిగా తాటిపాముల విజయలక్ష్మి వ్యవహరించిందని, ఈజీమని కోసమే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇంకా ఎంతమందికి ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయనే విషయమై విచారణ నిర్వహిస్తున్నామన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top