మార్ఫింగ్‌ ఫొటోలతో అశ్లీల చాటింగ్‌..!

Engineering Student Commits Online Harassment With Morphed Photos - Sakshi

ఆపై నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాలతో యువతులకు బెదిరింపు

యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, వరంగల్‌: సామాజిక మాధ్యమాల నుంచి యువతుల ఫొటోలను సేకరించాక మార్ఫింగ్‌ చేసి ఆ ఫొటోలతో ఇన్‌స్టాగ్రాం ఖాతాలు తెరుస్తున్నాడు.. ఆ ఖాతా ద్వారా యువతులతో చాటింగ్‌కు దిగేవాడు.. అయితే, అశ్లీలంగా చాటింగ్‌ చేయకపోతే మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు... అలా అంగీకరించని ఓ యువతి ఫొటోలను మిత్రులకు పంపించడంతో విషయం బయటపడగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధ్యుడైన ఇంజనీరింగ్‌ విద్యార్థిని అరెస్టు చేశారు. 

ధర్మారం వాసి...
వరంగల్‌ రూరల్‌ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి(మైనర్‌) ఇన్‌స్టాగ్రాంలోని యువతల ఫొటోలను సేకరిస్తున్నాడు. ఆ తర్వాత అశ్లీలకరమైన ఫొటోతో మార్ఫింగ్‌ చేసి ఆ ఫొటో ద్వారా నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాలు తెరిచేవాడు. ఆ ఖాతా ద్వారా తనతో అశ్లీలకరంగా చాటింగ్‌ చేయాలని.. లేకపోతే మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను తన కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు. ఈక్రమంలో ఓ యువతిని బెదిరిస్తూనే మార్ఫింగ్‌ చేసిన ఆమె ఫొటోను కాలేజీకి సంబంధించిన గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో ఖంగుతిన్న సదరు యువతి తల్లిదండ్రులు మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కమిషనరేట్‌ సైబర్‌ క్రైం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించి యువతల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకుడిని మట్టెవాడ పోలీసుల సహకారంతో బుధవారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఫిర్యాదు అందుకున్న అతితక్కువ సమయంలోనే నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన సైబర్‌ క్రైం విభాగం ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ తౌటం గణేష్‌తో పాటు ఏఏఓ ప్రశాంత్, కానిస్టేబుళ్లు కిషోర్‌కుమార్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్‌ను సీపీ రవీందర్‌ అభినందించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top