ప్రాణంతీసిన నిర్లక్ష్య వైద్యం | Doctor Negligence In Kothagudem | Sakshi
Sakshi News home page

ప్రాణంతీసిన నిర్లక్ష్య వైద్యం

Aug 9 2018 12:54 PM | Updated on Aug 9 2018 12:54 PM

Doctor Negligence In Kothagudem - Sakshi

న్యాయవాద గుమస్తా సమ్మయ్య మృతదేహం వద్ద  రోదిస్తున్న భార్య, ఇద్దరు కూతుళ్లు 

కొత్తగూడెంరూరల్‌ : వైద్యం వికటించి న్యాయవాద గుమస్తా మృతి చెందగా..ఆస్పత్రిలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇటు లాయర్లు, అటు రాజకీయ నాయకులు ఆందోళనకు దిగడంతో కొత్తగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాల్వంచ మండలం మంచికంటినగర్‌కు చెందిన అన్నపు సమ్మయ్య (38) కొత్తగూడెంలోని ఓ న్యాయవాది వద్ద గుమస్తాగా విధులు నిర్వహిస్తున్నాడు.

బుధవారం ఆయనకు ఆయాసం రావడంతో ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. దీంతో నర్స్‌ డాక్టర్‌కు ఫోన్‌లో విషయాన్ని తెలపగా..డాక్టర్‌ వెంకన్న హెడ్‌ నర్స్‌ భారతికి తిరిగి ఫోన్‌ చేసి డెరిఫ్లిన్, డెకడ్రాన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వమని చెప్పారు. అయితే ఒక నర్సింగ్‌ హోమ్‌లో మేల్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్‌ శిక్షణ నిమిత్తం ఆస్పత్రికి రాగా..ఆయనను ఇంజెక్షన్‌ చేయమని హెడ్‌నర్సు సూచించడంతో అతను రెండు ఇంజెక్షన్లు వేశాడు.

కాసేపటికే సమ్మయ్య పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఈ విషయాన్ని సమ్మయ్య భార్య చంద్రకళ తన బంధువులకు, కొత్తగూడెం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణకు తెలపడంతో..ప్రధాన కార్యదర్శి తోట మల్లేశ్వరరావు, లాయర్లు ఉపేందర్, సునీల్, రాజేష్, అడపాల పార్వతి, సాదిక్‌పాష, మునిగడప వెంకన్న, ఉషారాణి, జియా ఆస్పత్రికి చేరుకున్నారు.

అప్పటికే అక్కడికి చేరుకున్న వైద్యుడు వెంకన్నతో ఘర్షణ పడ్డారు. ఇంజెక్షన్‌ చేసిన వినోద్‌ను పిలిపించాలలని పట్టుబట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జనార్దన్‌ అక్కడికి వచ్చి లాయర్లు, బాధితులకు సర్దిచెప్పారు. డీఎస్పీ అలీ, సీఐ షుకూర్‌లు సంఘటన స్థలానికి చేరుకుని..సంబంధిత డాక్టర్లతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు.

వేర్వేరు చోట్ల ఆందోళన..

లాయర్లు, బంధువులు, మృతుడి భార్య చంద్రకళ, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆస్పత్రి వద్ద గంటపాటు ఆందోళన చేశారు. ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలు ఇవ్వాలని, అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వారంతా..సూపర్‌బజార్‌ సెంటర్‌లోకి వచ్చి రోడ్‌పై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్‌పాషాలు కూడా అక్కడే కూర్చుని మద్దతుగా నిలిచారు.

అనంతరం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ నేత వనమా రాఘవ, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఎడవల్లి కృష్ణ, సీపీఎం నేత అన్నవరపు సత్యనారాయణ అక్కడికి చేరుకుని..మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఐ షుకూర్, టూటౌన్‌ సీఐ శ్రీనివాసరావులు ఆందోళన విరమించాలని కోరారు. మృతుడి భార్య చంద్రకళకు ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం కల్పిస్తామని సూపరింటెండెంట్‌ జనార్దన్‌ హామీనివ్వడంతో వివాదం సద్దుమణిగింది.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కాసుల వెంకట్, అన్వర్‌పాషా, సీపీఐ నాయకులు జమలయ్య, శ్రీనివాసరెడ్డి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు ఈసం రమాదేవి, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి సందకూరి లక్ష్మి తదితర సీపీఐ కార్యకర్తలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, టూటౌన్‌ సీఐ సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement