ఇల్లు ముచ్చట తీరకుండానే పరలోకాలకు

Doctor Died in Road Accident Visakhapatnam - Sakshi

లారీకి పక్క నుంచి తగిలిన ద్విచక్ర వాహనం

తలకు తీవ్ర గాయాలతో ఘటనాస్థలిలోనే డాక్టర్‌ దుర్మరణం

మృతుడు శ్రీకాకుళం జిల్లా పలాస వాసి

కారుషెడ్‌ కూడలిలో ప్రమాదం

పీఎం పాలెం (భీమిలి) : ఇల్లు ముచ్చట తీరకుండానే ఓ డాక్టర్‌  దుర్మరణం పాలయ్యాడు. సొంతంగా కొనుగోలు చేసిన ప్లాట్‌లో ఇంటీరియల్, ఫర్నిచర్‌ పనులు చేయించి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. ఈ దుర్ఘటన పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై కారుషెడ్‌ కూడలి వద్ద జరిగింది. ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతానికి చెందిన రాష్ట్రపతి చౌదరి(43) నగరంలోని పెదవాల్తేరులో కుటుంబంతో నివసిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో రెసిడెన్స్‌ మెడికల్‌ ఆఫీసర్‌గా ఆయన పని చేస్తున్నారు. కొమ్మాది సమీపంలో ఇటీవల కొనుగోలు చేసిన ప్లాటుకు అవసరమైన ఫర్నిచర్, ఇంటీరియల్‌ పనులు చేయిస్తున్నారు. పనుల తీరు పరిశీలించడానికి మంగళవారం తన సహచరుడు సత్యనారాయణను తీసుకుని ద్విచక్ర వాహనంపై కొమ్మాదిలోని ప్లాటుకు వెళ్లారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు.

సరిగ్గా కారుషెడ్‌ కూడలి సమీపంలోకి వచ్చేసరికి లారీ పక్క నుంచి వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఆ లారీకి తగిలింది. దీంతో ద్విచక్రవాహనంతోపాటు రాష్ట్రపతి చౌదరిని లారీ కొంతదూరం ఈడ్చుకుంటూ పోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో చౌదరి ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచాడు. అతని సహచరుడు సత్యనారాయణ సురక్షితంగా బయటపడ్డాడు. మృతుని సహచరుడు కిరణ్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రవికుమార్‌ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆనందం ఆవిరి : రోగులకు ఉత్తమ సేవలు అందించే డాక్టర్‌గా రాష్ట్రపతి చౌదరికి  ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో మంచి పేరుంది. ఆయన భార్య ప్రభావతి ప్రముఖ ఆస్పత్రిలో నర్స్‌గా పని చేస్తున్నారు. కుమారుడు విలాస్‌ చౌదరి(17) ఇటీవల ఇంటర్‌ పూర్తి చేయగా, కమార్తె నేహా చౌదరి(16) ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అం దంగా సాగిపోతున్న ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు కాటేసిందని, సొంత ఇంటిలోకి ప్రవేశించకుండానే పరలోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హెల్మెట్‌ ధరించినప్పటికీ ప్రాణాలు నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top