మానవత్వమా నీవేక్కడ..?

Delhi Commission for Women Save A Woman And They Said She Served A Bread For 4 Days - Sakshi

న్యూఢిల్లీ : మానవత్వం, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న రోజులివి. ‍బిడ్డలకు కన్న తల్లిదండ్రులు బరువవుతున్న కాలం ఇది. కడపున పుట్టిన వారే కడవరకూ చూస్తారనే నమ్మకంలేని కాలంలో తోడబుట్టిన వారి నుంచి ఇలాంటి ఆప్యాయతను ఆశించడం అత్యాశే అవుతోంది. మతి స్థిమితం లేని సోదరి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడో అన్న. తోబుట్టువుగా కాదు కదా కనీసం మనిషి అనే విషయాన్ని మరిచి ఆమెకు ప్రత్యక్ష నరకం చూపించాడు. చివరకూ ఢిల్లీ మహిళా కమీషన్‌ చొరవతో బాధితురాలు ఆ నరకం నుంచి బయటపడ్డారు.

హృదయవిదారకమైన ఈ ఘటన వివరాలు.. ఢిల్లీకి చెందిన బాధితురాలు మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇద్దరూ సొదరులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు మరణించే వరకూ వారితో పాటు ఉన్న బాధితురాలిని రెండేళ్ల క్రితం ఆమె సోదరుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి అతడు తన భార్యతో కలిసి బాధితురాలిని తీవ్రంగా హింసిస్తున్నారు. ఆమెకు సరైన తిండి కాదు కదా అసలు భోజనం పెట్టడమే మానేశారు. నాలుగు రోజులకు ఒకసారి ఒక బ్రెడ్డు మాత్రమే ఇస్తున్నారు. బాధితురాలు మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె తన పనులను స్వయంగా చేసుకోలేదు. సోదరుడు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె తన మలమూత్రాల మధ్యనే అత్యంత జుగుప్సాకరమైన పరిసరాల్లో జీవనం గడుపుతోంది.

బాధితురాలికి మరో సోదరుడు ఉన్నాడు. కానీ ఆమె ప్రస్తుతం ఉంటున్న సోదరుడు ఆమెను చూడటానికి ఎవ్వరిని అనుమతిచ్చేవాడు కాదు. దాంతో బాధితురాలి రెండో సోదరుడు ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచరం అందించాడు. అధికారులు బాధితురాలి సోదరుని ఇంటికి వచ్చినప్పుడు, అతడు వారిని తిట్టడమే కాక ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుపడ్డాడు. దాంతో సదరు అధికారులు స్థానిక పోలీసుల సాయంతో ఇంట్లోకి వెళ్లి అక్కడ అత్యంత దయనీయ స్థితిలో ఉన్న బాధితురాలిని అంబేద్కర్‌ ఆస్పత్రిలో చేర్చారు.

ఈ విషయం గురించి ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ మాట్లాడుతూ ‘బాధితురాలి వయసు కేవలం 50 ఏళ్లు ఉండోచ్చు.. కానీ సరైన పోషణ అందకపోవడంతో 90 ఏళ్ల వయసు వ్యక్తిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రిలో చేర్చాం. అనంతరం అక్కడి నుంచి ప్రభుత్వ పర్యవేక్షణలోని ఆశ్రమానికి మారుస్తాం. ప్రజలు కూడా తమ చుట్టు పక్కల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు మాకు తెలియజేయండి. బాధితులకు సాయం చేయండి’ అని కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top