జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు | Cybercrime Police Says Carefull About Unkmown Messages Through PAYtm And Phone Pay | Sakshi
Sakshi News home page

జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు

Jun 21 2020 7:30 AM | Updated on Jun 21 2020 7:38 AM

Cybercrime Police Says Carefull About Unkmown Messages Through PAYtm And Phone Pay - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో పంజా విసురుతున్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా నగరవాసులు అరచేతిలోని సెల్‌ఫోన్‌ నుంచే అన్ని చెల్లింపులకు వేదికగా ఉన్న పేటీఎం, ఫోన్‌పే తదితర యునైటెడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) సర్వీసులను లక్ష్యం చేసుకుంటున్నారు. గత ఆరు నెలలుగా పేటీఎం, ఇతర యూపీఐల నుంచి నో యువర్‌ కస్టమర్‌ (కైవేసీ) వివరాలు అప్‌డేట్‌ చేస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఓవైపు సెల్‌ఫోన్లకు కాల్‌ చేస్తూ.. ఇంకోవైపు సంక్షిప్త సమాచారాలు పంపుతూ వల వేస్తున్నారు. ఇలా సైబర్‌ నేరగాళ్ల మాయలో పడిన బాధితులకు కేవైసీ అప్‌డేట్‌ చేసే సమయంలో యాప్‌లు డెస్క్‌ యాప్, క్విక్‌ సపోర్ట్‌ యాప్, టీమ్‌ వీవర్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోమని చెబుతారు. అది అయిందా, లేదా అని తనిఖీ చేసేందుకు తొలుత రూ.1, లేదంటే రూ.100లు బదిలీ చేయాలని నమ్మబలుకుతారు. ఈ సమయంలో బాధితుడి బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే హ్యాక్‌ చేసి లక్షల్లో డబ్బులను తమ బ్యాంక్‌ ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. ఇలా గత ఆరు నెలల నుంచి సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో 50కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈతరహా మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. 

ఇవి చేయకండి.. 
పేటీఎం అకౌంట్‌లైనా, ఇతర ఖాతాలైన ఆయా సంస్థ ప్రతినిథులు ఫోన్‌ కాల్‌ చేసి కేవైసీ వివరాలు అప్‌డేట్‌ చేయమని అడగరు. ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపరు. అకౌంట్‌ వివరాలను ఎవరికీ చెప్పవద్దు. వివిధ అప్లికేషన్‌లు అవి ఎందుకు ఉపయోగపడతాయో తెలుసుకోకుండా డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. తనిఖీ కోసం ఇతరుల బ్యాంక్‌ ఖాతాకు అసలు డబ్బులు బదిలీ చేయవద్దు. మీ నాలెడ్జ్‌ లేకుండానే, మిమ్మల్ని మోసగించి డౌన్‌లోడ్‌ చేయించిన అప్లికేషన్‌ల ద్వారా మీ బ్యాంక్‌ ఖాతా వివరాలను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేసి లక్షలు కాజేసే అవకాశముంది. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మచ్చుకు ఓ కేసు..  
ఇటీవల మాదాపూర్‌కు చెందిన అరుణ్‌ సెల్‌ఫోన్‌కు మీ పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్‌ నంబర్‌ నుంచి సంక్షిప్త సమాచారం వచ్చింది. వెంటనే అరుణ్‌ సదరు నంబర్‌కు ఫోన్‌న్‌కాల్‌ చేశారు. ఆయన అకౌంట్‌ను అప్‌డేట్‌ చేసేందుకు పేటీఎం వివరాలు కావాలనడంతో పాటు ఏనీ డెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని రూ.100 నామినీ డబ్బుగా పంపితే అప్‌డేట్‌ అవుతుందని నమ్మించాడు. ఇది నమ్మిన అరుణ్‌ ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి బ్యాంక్‌ ఖాతా వివరాలు ఎంట్రీ చేయగానే సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. పేటీఎం నుంచి దశల వారీగా రూ.92,345లు డెబిట్‌ అయ్యాయని సెల్‌కు ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement