సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు | Cine hero Rajasekhar suffered minor injuries in road accident | Sakshi
Sakshi News home page

సినీ హీరో రాజశేఖర్‌కు గాయాలు

Nov 14 2019 3:00 AM | Updated on Nov 14 2019 4:57 AM

Cine hero Rajasekhar suffered minor injuries in road accident - Sakshi

ప్రమాదంలో ధ్వంసమైన కారు

శంషాబాద్‌ రూరల్‌: శంషాబాద్‌ మండలం పెద్ద గోల్కొండ శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న టీఎస్‌07 ఎఫ్‌జడ్‌1234 నంబర్‌ గల బెంజ్‌ కారు బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఎయిర్‌ బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది. అయితే వాహనం మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజశేఖర్‌ మంగళవారం రాత్రి ఫిలింసిటీ నుంచి హైదరాబాద్‌కు తన బెంజ్‌ కారులో డ్రైవింగ్‌ చేసుకుంటూ బయలుదేరారు. అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట్‌ జంక్షన్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి చేరుకున్నారు.

అక్కడి నుంచి సుమారు 38 కి.మీ. దూరం ప్రయాణం చేసిన తర్వాత శంషాబాద్‌ మండలం పెద్ద గోల్కొండ శివారులోకి రాగానే సుమారు 1.15 గంటల ప్రాంతంలో కారు అదుపు తప్పింది. కుడి వైపున ఉన్న డివైడర్‌పై చెట్లను ఢీకొంటూ సుమారు 70 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లి రోడ్డు అవతలి వైపున బోల్తా పడింది. కారు రోడ్డు అవతలి వైపు బోల్తా పడిన సమయంలో అటుగా వేరే వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడిన రాజశేఖర్‌ అటుగా వస్తున్న వేరే కారులో గచ్చిబౌలి వైపు వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే సమాచారం అందడంతో అప్పటికప్పుడే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ రాజశేఖర్‌ లేకపోవడంతో కారును స్టేషన్‌కు తరలించారు. 

అతివేగమే కారణం... 
హీరో రాజశేఖర్‌ కారు ప్రమాదానికి ర్యాష్‌ డ్రైవింగే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఐపీసీ 336, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఔటర్‌పైకి ఎక్కిన అరగంటలోపే ప్రమాదానికి గురి కావడాన్ని బట్టి కారు వేగం గంటకు 120 కి.మీ. నుంచి 140 కి.మీ. మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే కారు టైరు కూడా పగిలిపోవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారుల నివేదిక ఆధారంగా ఈ విషయంపై నిర్ధారణకు రానున్నట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. ఇక రాజశేఖర్‌ వాహనంపై ఓవర్‌స్పీడ్‌కు సంబంధించి 23 ట్రాఫిక్‌ చలాన్లున్నాయని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement