సంగారెడ్డిలో చెడ్డీగ్యాంగ్‌ | Cheddi gang in Sanga Reddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో చెడ్డీగ్యాంగ్‌

Jun 14 2018 11:15 AM | Updated on Aug 11 2018 6:07 PM

Cheddi gang in Sanga Reddy - Sakshi

అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో సంచరిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ సభ్యుడు

సంగారెడ్డి క్రైం/ సంగారెడ్డి రూరల్‌ : హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఇప్పటి వరకు కలకలం రేపిన చెడ్డీగ్యాంగ్‌(దొంగలముఠా) సంగారెడ్డి పట్టణానికి ఆనుకుని ఉన్న పోతిరెడ్డిపల్లిలో మంగళవారం రాత్రి హల్‌చల్‌ చేసింది. పోతిరెడ్డిపల్లిలో శ్రీనిలయం, అతిథిమన్‌షన్‌ అనే అపార్ట్‌మెంట్‌తో పాటు మరో అపార్ట్‌మెంట్‌లో చొరబడి దోపిడీకి విఫలయత్నం చేశారు.

ఎనిమిది రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్లు ఒకే చోట ఉండడంతో ఈ ప్రాంతాన్ని చెడ్డీగ్యాంగ్‌ చోరీకి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి రెండున్నర గంటలు(తెల్లవారితే బుధవారం) సమయంలో సంచరించారు. అతిథి, శ్రీనిలయంతో పాటు మరో అపార్ట్‌మెంట్‌లలో కలియతిరిగారు. ఈ సన్నివేశాలు ఆయా అపార్ట్‌మెంట్‌లలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల్లో నమోదయ్యాయి. 

కెమెరాలు పైకి ఉండడంతో అనుమానం

ఉదయం ఓ అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలన్ని పైకి ఉండడంతో అనుమానం వచ్చిన వాచ్‌మెన్‌ విషయాన్ని మేనేజ్‌మెంట్‌ కమిటీ దృష్టికి తీసుకుపోయాడు. వారు వచ్చి సీసీ కెమెరా ఫుటేజీ చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమ వద్ద ఉన్న కట్టెలతో చెడ్డీగ్యాంగ్‌ ముఠా సభ్యులు తమ ఆనావాళ్లను కనబడకుండే ఉండేందుకు కెమెరాలను పైకి లేపినట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులకు తారసపడ్డ గ్యాంగ్‌...

పోతిరెడ్డిపల్లిలోని అపార్ట్‌మెంట్‌లలో  చోరికి ప్రయత్నించిన ఐదుగురు చెడ్డీగ్యాంగ్‌ ముఠా సభ్యులు రాత్రి సమయంలో పోలీసులకు తారసపడ్డారు. అపార్ట్‌మెంట్ల వైపు నుంచి ఇతర అపార్ట్‌మెంట్లలోకి వెళ్తున్న సమయంలో పోలీసుల పెట్రోలింగ్‌ వాహనం సైరన్‌ విన్న చెడ్డీగ్యాంగ్‌ ముఠా పరుగులు పెట్టడంతో పోలీసులు కూడ వారిని వెంబడించినట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీకాంత్, సీఐ నరేందర్‌ సిబ్బందితో కలిసి తప్పించుకున్న చెడ్డిగ్యాంగ్‌ను పట్టుకోవడానికి సంగారెడ్డి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉదయం వరకు వెతికినా దొరకలేదు. 

వణుకుతున్న ప్రజలు...

చెడ్డీగ్యాంగ్‌ సంగారెడ్డి ప్రాంతానికి  చేరుకుందన్న సమాచారం వాట్సాప్, ఫెస్‌బుక్‌ల ద్వారా వ్యాప్తి చెందడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. భయంకరమైన ఈ దొంగల  గ్యాంగ్‌ తమ ప్రాంతంలో సంచరిస్తుందేమోనన్న అనుమానంతో ఆందోళన చెందుతున్నారు.

ఈ  చెడ్డిగ్యాంగ్‌ దొంగలుముఠా సభ్యులు బట్టలు లేకుండ కేవలం చెడ్డీలు వేసుకుని శరీరమంతా నూనె పుసుకొని ఉండటం సీసీ పుటేజిల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికైన తారసపడ్డా దొరకకుండ ఉండేందుకు శరీరమంతా నూనె పుసుకుని ఈ గ్యాంగ్‌సభ్యులు జాగ్రత్త పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దొంగల ముఠా సభ్యులను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని అందించాలి

అనుమానాస్పద వ్యక్తులు ఎవరైన సంచరిస్తే ప్రజలు వెంటనే 100కు లేదా 9490617033, 9490617032 నంబర్‌కు సమాచారం అందించాలని రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ సూచించారు. అనుమానంతో సామాన్య వ్యక్తులపై దాడి చేసి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. చెడ్డిగ్యాంగ్‌ దొంగల ముఠా సభ్యులను త్వరలో పట్టుకుంటామన్నారు. ప్రజలు ఆందోళన చెంద వద్దన్నారు. 

– రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌

భయంగా ఉంది

ఎప్పుడు ప్రశాంతంగా ఉండే అపార్ట్‌మెంట్లలలో దొంగలముఠా రాత్రి వచ్చిందని తెలిసి మస్తు భయం వేసింది. అపార్ట్‌మెంట్‌లలో ఉన్న సీసీ ఫుటేజీల్లో దొంగలు తిరిగిన గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విషయం తెలిసినప్పటి నుంచి చుట్టు పక్కల ఉంటున్న వారందరం భయపడుతున్నాం. – ఆంజనేయులు, వాచ్‌మెన్‌

రక్షణ కల్పించాలి

మేము ఉంటున్న ఈ అపార్ట్‌మెంట్‌లలో దొంగలు తిరుగుతున్నారని  సీసీ  టీవీల్లో చూసినం. ఇంతకు ముందు ఎన్నడు ఇలా జరగలేదు. దొంగల విషయం తెలిసినప్పటి నుంచి మేమంతా చాలా భయపడుతున్నాం. పోలీసులు మా అపార్ట్‌మెంట్లకు దొంగల నుంచి రక్షణ కల్పించాలి. – సముద్రమ్మ, అపార్ట్‌మెంట్‌ నివాసిశ్రీనిలయం

1
1/1

అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తులో సంచరిస్తున్న చెడ్డీగ్యాంగ్‌ సభ్యులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement