బిల్డర్‌గా బిల్డప్‌ ఇచ్చి..

Cheating in Matrimony Sites Government Employee loss 2 lakhs - Sakshi

పెళ్లి పేరుతో ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా

రూ. 2 లక్షలు వసూలు  

నగరంలో మరో మాట్రి‘మోసం’!  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో మాట్రిమోనియల్‌ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగినిని పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు స్కాట్‌ల్యాండ్‌లో బిల్డర్‌గా బిల్డప్‌ ఇచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2 లక్షలు కాజేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తగిన సంబంధం కోసం భారత్‌మాట్రిమోనీ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని తన ప్రొఫైల్‌ అప్‌లోడ్‌ చేశాడు. దీనికి స్పందనగా  లోకేష్‌జోషి అని చెప్పుకున్న వ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్‌ వచ్చింది. తాను స్కాట్‌ల్యాండ్‌లో బిల్డర్‌గా పనిచేస్తున్నానని, మీ ప్రొఫైల్‌ నచ్చిందని ఆసక్తి చూపాడు. ఒకరి నంబర్లు మరొకరు మార్చుకున్న తర్వాత చాటింగ్‌ చేయడంతో పాటు ఆమెతో ఫోన్‌లోనూ మాట్లాడిన అతను వివాహం చేసుకుంటానంటూ ప్రతిపాదించాడు. వారం రోజుల పాటు నమ్మకంగా ఉన్న లోకేష్‌ జోషి ఆపై అసలు కథ ప్రారంభించాడు. దుబాయ్‌లోనూ తాను కొన్ని భవనాలు నిర్మిస్తున్నానని చెప్పి, ఆ సైట్‌లో పని చేసే ఓ కార్మికుడు తీవ్రంగా గాయడినట్లు చెప్పాడు. ఈ ఘటనలో అతను డబ్బులు కూడా పోగొట్టుకున్నాడని చెబుతూ భారత్‌లో ఉంటున్న అతడి కుటుంబీకులకు అత్యవసరంగా కొంత మొత్తం పంపాల్సి ఉందని చెప్పాడు.

తన వద్ద డబ్బు ఉన్నప్పటికీ స్కాట్‌ల్యాండ్‌ నుంచి పంపడం ఆలస్యం అవుతుందని చెప్పిన మోసగాడు రూ. 37 వేలు వారికి చేర్చాలని కోరాడు. సదరు కార్మికుడి భార్య కూడా అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనందున, డబ్బులను నేరుగా వైద్యుడి ఖాతాకు పంపాలని కోరాడు. ఇందుకు ఆమె అంగీకరించడంతో ఓ బ్యాంకు ఖాతా నంబర్‌ పంపి అందులో డిపాజిట్‌ చేయించాడు. అప్పటి నుంచి మొదలుపెట్టి తన దుబాయ్‌ సైట్‌లో యంత్రాలు మరమ్మతులు గురయ్యాయని వాటిని రిపేర్‌ చేయించేందుకు రూ.3.5 లక్షలు రావాలని మరోసారి కోరాడు. అయితే తన వద్ద అంత మొత్తం లేదని చెప్పిన ఆమె రూ.60 వేలు బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేసింది. ఈ నెల 4న తాను దుబాయ్‌ మీదుగా ముంబైకి వస్తున్నట్లు చెప్పిన అతను కేవలం నీ కోసమే ఈ ప్రయాణమంటూ చెబుతూ ఇండియాకు వచ్చాక  నీకు ఓ బహుమతి ఇస్తానంటూ నమ్మబలికాడు. అంతటితో ఆగకుండా దుబాయ్‌ నుంచి ముంబైకి బుక్‌ చేసినట్లు సృష్టించిన ఓ విమాన టిక్కెట్టునూ వాట్సాప్‌ చేశాడు. ఆ మర్నాడే ముంబై విమానాశ్రయం నుంచి అంటూ ఆమెకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది.

కస్టమ్స్‌ అధికారులుగా చెప్పుకున్న అవతలి వ్యక్తులు జోషి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, అతడి వద్ద భారీ మొత్తం లండన్‌ పౌండ్స్‌ రూపంలో ఉన్నట్లు చెప్పారు. అలా నగదు రూపంలో తీసుకురావడం నేరమని చెప్పారు. అతికష్టమ్మీద అతడితో మాట్లాడే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ఆపై అదే ఫోన్‌ కాల్‌లో మాట్లాడిన జోషి తన వద్ద ఉన్న భారీ మొత్తాన్ని నీ కోసం తీసుకువస్తున్నానని, భారత్‌ కరెన్సీలో రూ.కోట్లలో ఉండే ఆ పౌండ్స్‌ను విడిచిపెట్టాలంటే కస్టమ్స్‌ అధికారులు రూ.9.5 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. ఇది నమ్మిన ఆమె అతడు సూచించిన ఖాతాకు రూ.లక్ష  బదిలీ చేసింది. అంతటితో ఆగని అతగాడు మిగిలిన రూ.8.5 లక్షలనూ పంపాలని కోరాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు దుండగులు వాడిన ఫోన్‌ నంబర్లతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top