పెళ్లి పేరుతో సంపన్నులను బుట్టలో వేసుకొని.. | Cheater Bride Mounika Arrest In YSR kadapa | Sakshi
Sakshi News home page

నిత్య పెళ్లి కూతురు అరెస్టు!

Nov 20 2018 12:40 PM | Updated on Nov 20 2018 12:43 PM

Cheater Bride Mounika Arrest In YSR kadapa - Sakshi

కిలాడీ లేడీది ప్రకాశం జిల్లా మొహిద్దీన్‌పురం..

వైఎస్‌ఆర్‌ జిల్లా, ఖాజీపేట/గిద్దలూరు: పవిత్రమైన వివాహ బంధాన్ని ఎగ‘తాళి’ చేసేలా వ్యవహరించి వరుసగా ఆరుగురిని వివాహం చేసుకున్న ఓ నిత్య పెళ్లికూతురును వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరు రూరల్‌ సీఐ కంభగిరి రాముడు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖాజీపేట మండలం కొమ్మలూరుకు చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మూడు నెలల క్రితం ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం మోదినీపురం గ్రామానికి చెందిన మౌనికను వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నెల 25న ఆమె తండ్రి వచ్చి కూతురిని పుట్టింటికి తీసుకెళ్తున్నానని చెప్పి పిలుచుకుని వెళ్లాడు. ఆమె వెళ్లేటప్పుడు అత్తింటిలో నుంచి బంగారు నగలను తీసుకెళ్లింది. ఆమె తిరిగి రాకపోగా, ఆమె పుట్టింట్లో కూడా లేకపోవడంతో అన్నిచోట్లా గాలించి ఈనెల 10న ఆమె భర్త రామకృష్ణారెడ్డి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మౌనికతో పాటు, ఆమె తండ్రి అనంతరెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు వీరిని మైదుకూరు పట్టణంలో గుర్తించి ఆదివారం అరెస్టు చేశారు.  మౌనిక, ఆమె తండ్రి అనంతరెడ్డి తోపాటు రత్నావల్‌ చంటినాయక్‌  ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆ నగలను విక్రయించి వచ్చిన డబ్బుతో వీరు ముగ్గురూ జల్సాలు చేసేవారు. ముగ్గురిపై ఛీటింగ్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కిలాడీ లేడీది ప్రకాశం జిల్లా మొహిద్దీన్‌పురం..
ఆరు పెళ్లిళ్లు చేసుకుని భర్తలను మోసం చేస్తూ బంగారు నగలు, నగదుతో ఉడాయిస్తున్న మౌనికది ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలోని మొహిద్దీన్‌పురం. మొహిద్దీన్‌పురానికి చెందిన చేగిరెడ్డి అనంతరెడ్డిది పేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. అనంతరెడ్డికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మద్యం వ్యసనానికి బానిసైన అనంతరెడ్డి అందంగా ఉన్న తన కుమార్తెను పావుగా చేసుకుని సంపాదించాలనుకున్నాడు. పెళ్లి మీద పెళ్లి చేస్తూ నగలు, డబ్బుతో  ఉడాయిస్తున్నాడు. మార్కాపురంలో మొదటి పెళ్లి చేశాడు. నెలకే ఇంటికి వచ్చింది. రెండో వివాహం గిద్దలూరు మండలంలోని వేములపాడు గ్రామంలో చేసుకుంది. రెండు నెలలకే నగలు, డబ్బుతో పుట్టింటికి చేరింది. రెండేళ్లు ఖాళీగా ఉన్న ఆమె.. తిరిగి మూడో పెళ్లి బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లెలో యువకుడిని చేసుకుంది. రెండు నెలలకే భర్తకు చెందిన బంగారు, నగదు తీసుకెళ్లడంతో వారు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. నాలుగో వివాహం తెనాలిలో, ఐదో పెళ్లి ఖాజీపేటలో చేసుకుని నగలు, డబ్బుతో పరారు కావడంతో అక్కడ కేసు నమోదయింది. ఆ కేసు ఉండగానే హైదరాబాద్‌కు చెందిన యువకుడిని ఆరో వివాహం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement