రైతుల ఖాతాల్లో .. నగదు మాయం | Cash Missing in the farmers' accounts | Sakshi
Sakshi News home page

రైతుల ఖాతాల్లో .. నగదు మాయం

Oct 28 2017 2:26 AM | Updated on Oct 1 2018 2:11 PM

Cash Missing in the farmers' accounts - Sakshi

మడకశిర: పలువురు రైతుల ఖాతాల్లోని పంటనష్టపరిహారం సొమ్ము మాయమైంది. అమాయక రైతులను ఏటీఎం కేంద్రం వద్ద అపరిచిత వ్యక్తులు ఏమార్చి.. ఏటీం కార్డు మార్పు చేసి.. అనంతరం ఖాతాల్లోంచి డబ్బు కాజేశారు. వివరాలిలా ఉన్నాయి. మడకశిరలోని ఏడీసీసీ బ్యాంకులో నియోజకవర్గంలోని పలువురు రైతులకు ఖాతాలు ఉన్నాయి. పంటనష్టపరిహారం డబ్బు ఇటీవల రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. అయితే ఈ డబ్బును బ్యాంకులో డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించలేదు. ఏటీఎం కేంద్రాలకు వెళ్లి తీసుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు. అమరాపురం మండలం నిద్రఘట్టకు చెందిన రైతు నాగేంద్ర తన ఖాతాలో జమ అయిన మొత్తాన్ని డ్రా చేసుకునేందుకని ఈ నెల 24న మడకశిరలోని ఓ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అక్కడ పక్కనే ఉన్న అపరిచిత వ్యక్తి సాయంతో రూ.2వేలు డ్రా చేయించుకున్నాడు. ఆ వ్యక్తి రైతును ఏమార్చి వేరొక ఏటీఎం కార్డు ఇచ్చి పంపించాడు.

అనంతరం పిన్‌ నంబర్‌ గుర్తు పెట్టుకుని రూ.28వేలను అదే రోజు డ్రా చేసేశాడు. ఇదే తరహాలోనే మడకశిర మండలం డి.అచ్చంపల్లికి చెందిన సుబ్బరాయప్ప ఖాతా నుంచి కూడా రూ.4800, గుడిబండ మండలం కేఎన్‌ పల్లికి చెందిన హనుమంతప్ప ఖాతా నుంచి రూ.20 వేల నగదును ఎవరో డ్రా చేసేశారు. బాధిత రైతులు శుక్రవారం ఏడీసీసీ బ్యాంకు వద్దకు వచ్చి మేనేజర్‌ గోపాల్‌రెడ్డి వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ లింగన్నను కలిసి తాము మోసపోయిన తీరును వివరించి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ బాబు ఏడీసీసీ బ్యాంకుకు వెళ్లి బాధిత రైతుల ఖాతాలను పరిశీలించారు. అపరిచితులు కర్ణాటక, ఎస్‌బీఐ ఏటీఎంల ద్వారా డబ్బు డ్రాచేసుకున్నట్లు తెలుస్తోందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement