6.46 కిలోల బంగారం పట్టివేత!  

Capture of 6 kg above gold - Sakshi

తక్కువ చార్జీలతో ఉమ్రా యాత్ర పేర పేదలకు ఎర

తిరిగొచ్చేప్పుడు ‘క్యారియర్లు’గా మారాలని ఒత్తిడి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 14 మంది అరెస్టు 

సాక్షి, హైదరాబాద్‌: బంగారం స్మగ్లర్లు అక్రమ రవాణా కోసం పేదలను ఎంచుకుని నామమాత్రపు చార్జీలతో/ఉచిత ఉమ్రా యాత్ర పేర ఎర వేశారు. అలా వెళ్లిన వారిని భయపెట్టి జిద్దా నుంచి 6.46 కేజీల పసిడిని పంపారు. పక్కా సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులతో కలసి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆపరేషన్‌ చేపట్టగా 14 మంది చిక్కారు. ఈ వివరాలను నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌ కేంద్రంగా వ్యవస్థీకృతంగా బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న సూత్రధారులు అంతర్జాతీయ స్థాయిలోనూ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నారు. వీరికి సంబంధించిన కొందరు ఏజెంట్ల ద్వారా కొత్త పంథాలో పసిడి అక్రమ రవాణాకు ప్రయత్నించారు. నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కొందరు ఏజెంట్లను నియమించుకున్న సూత్రధారులు వీరి సాయంతో నిరుపేదలైన మైనార్టీలను ఆకర్షించారు. ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో ఉమ్రా యాత్రకు తీసుకువెళ్తామంటూ వారికి ఎర వేశారు. వీరి వలలో పడిన 14 మంది స్త్రీ, పురుషులు గత నెలలో యాత్రకు వెళ్లారు. 

క్యారియర్లుగా మారాలని ఒత్తిడి...
యాత్ర పూర్తయిన తర్వాత వీరందరిని స్మగ్లర్లు జిద్దా తీసుకువెళ్లారు. అక్కడ ఓ ప్రాంతంలో నిర్భంధించి బంగారం స్మగ్లింగ్‌కు తమకు సహకరించాలని ఆదేశించారు. ఈ పని చేయడానికి యాత్రికులు విముఖత చూపగా... తమ మాట వినకపోతే జిద్దాలో అరెస్టు చేయిస్తామని, యాత్రకయ్యే మొత్తం ఖర్చులు చెల్లించాలని భయపెట్టారు. చివరకు ఎటూపాలుపోని స్థితిలో యాత్రికులు క్యారియర్లుగా మారడానికి అంగీకరించారు. దీంతో మొత్తం 6.46 కేజీల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలు, 24 క్యారెట్ల కడ్డీలు, చైన్ల రూపంలోకి మార్చారు. వీటిని ఆ 14 మందికి అప్పగించి లోదుస్తుల్లో దాచుకునేలా ఆదేశించారు. మంగళవారం జిద్దా నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌లో వీరిని హైదరాబాద్‌కు పంపారు. ఇలా వచ్చే వీరి ఫొటోలు, వివరాలను జిద్దాలో ఉండే ఏజెంట్లు వాట్సాప్‌ ద్వారా నగరంలోని ఏజెంట్లకు పంపారు. వీరి వివరాలను క్యారియర్లకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వీళ్లు చిక్కినా సూత్రధారులు వ్యవహారం బయటకు రాకూడదనే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్‌ వద్ద వీళ్లకు స్థానిక ఏజెంట్లు కలుస్తారు. అక్కడ నుంచి వీరిని ఓ రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి బంగారం స్వాధీనం చేసుకుంటారు. ఈ పసిడిని చేరాల్సిన వ్యాపారులకు చేర్చి క్యాష్‌ చేసుకుంటారు.  

పక్కా సమాచారంతో..
నిరుపేదలకు పవిత్ర యాత్ర పేరుతో ఎర వేసి క్యారియర్లుగా మార్చుకునే ముఠా వ్యవహారంపై సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఈ స్మగ్లింగ్‌కు చెక్‌ పడింది. మరికాస్త లోతుగా ఆరా తీసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గ్రూప్‌ బుకింగ్‌ ద్వారా వెళ్లిన వీరందరికీ విమానం టికెట్లు ఒకే పీఎన్‌ఆర్‌ నంబర్‌తో బుక్‌ అయినట్లు తెలుసుకున్నారు. దీంతో అదనపు డీసీపీ చైతన్య ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ మధుమోహన్‌రెడ్డి ఆ పీఎన్‌ఆర్‌ నంబర్, ఓ ప్రయాణికుడి పేరు సేకరించారు. వీళ్లు విమానం దిగి బయటకొస్తే పట్టుకోవడం కష్టమని, కొందరైనా పారిపోయే ప్రమాదముందని భావించా రు. విమానాశ్రయంలోకి వెళ్లి ఆపరేషన్‌ చేపట్టే అవకాశం టాస్క్‌ఫోర్స్‌కు లేకపోవడంతో విషయాన్ని మంగళవారం రాత్రి డీఆర్‌ఐకి అందించారు. అప్రమత్తమైన ప్రత్యేక టీమ్స్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. సదరు పీఎన్‌ఆర్‌ నంబర్‌ను తనిఖీ చేయగా మొత్తం 14 మంది యాత్రికుల పేర్లు బయటపడ్డాయి. దీంతో విమానాశ్రయం లోపల డీఆర్‌ఐ, బయట టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వలపన్నారు. విమా నం దిగి ఎగ్జిట్‌ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేసిన 14 మందిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ.. తనిఖీ చేయగా వివిధ రూపా ల్లో ఉన్న 6.46 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ మార్కెట్‌లో రూ.2.17 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీనికి సంబంధించి వీరివద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో అక్రమ రవాణాగా తేల్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top