నేరం చేసిందెవరో? | Sakshi
Sakshi News home page

నేరం చేసిందెవరో?

Published Mon, Aug 20 2018 7:16 AM

Bomb Blast Case In Kurnool - Sakshi

ఆస్పరి మండలం కారుమంచి గ్రామం సమీపంలో ఐదేళ్ల క్రితం కోటప్ప అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఎవరు చంపారో.. ఎందుకు చంపారో అనే విషయం ఇప్పటి వరకు బయట పడలేదు. భార్య ఫిర్యాదు మేరకు ఆస్పరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు సాగుతూనే ఉంది.

కోడుమూరు మండలం ఎర్రదొడ్డి గ్రామ శివారులోని అనుగొండ రోడ్డులో ఓ మహిళపై అత్యాచారం జరిపి పెట్రోల్‌ పోసి కాల్చి చంపారు. ఈ కేసు మిస్టరీ వీడలేదు. 

ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన రైతు పెద్ద ఈరన్నను పాత కక్షలతో ప్రత్యర్థులు హత్య చేసి చింత చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఈ కేసు కూడా ఇప్పటివరకు దర్యాప్తు దశలోనే ఉంది. 

కర్నూలు: నేరాలు జరిగిన తర్వాత పోలీసుల హడావుడి అంతా ఇంతా కాదు. ఘటన స్థలాన్ని పలుమార్లు పరిశీలించడంతోపాటు.. క్లూస్‌ టీమ్, పోలీస్‌ జాగిలాలతో గాలింపు చర్యలు చేపడతారు. ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటవుతాయి. అయితే కేసుల దర్యాప్తులో ఆధారాలు లభించవు. దీంతో వాటిని మూసివేడయం పరిపాటిగా మారింది. కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక కేసును ఇలానే చేశారు. భూపాల్‌ నగర్‌ వద్ద పొలాలకు వెళ్లే దారిలోని వంకలో కర్నూలు పాతబస్తీకి చెందిన వడ్డీ వ్యాపారి ఎనిమిదేళ్ల క్రితం దారుణ హత్యకు గురవగా కేసు నమోదైంది. దర్యాప్తులో పలు అనుమానాలు వ్యక్తమైనప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించక కేసు మూసేశారు.

అలాగే 2016 జూన్‌ 11న సి.బెళగల్‌ సమీపంలో సుమారు 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని హత్య చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టి ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ కేసు దర్యాప్తు పూర్తి కాలేదు. కోడుమూరు–కర్నూలు రోడ్డులోని పరప్ప జున్ను దగ్గర  2010లో కత్తెర లక్ష్మి అనే మహిళను అత్యంత దారుణంగా హత్య చేసి వరి పొట్టులో పూడ్చిపెట్టారు. ఆనవాళ్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు కూడా పంపారు. వివాహేతర సంబంధంతో ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు అప్పటి సీఐకి గ్రామస్తులు కొంతమంది ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఇదే కోవలోకి కర్నూలు బాంబు పేలుళ్ల కేసు కూడా వస్తుందనే విమర్శలు ఉన్నాయి.

ఎందుకంటే.. 
కర్నూలు శివారులోని నంద్యాల చెక్‌పోస్టు నుంచి జొహరాపురం వెళ్లే దారి మున్సిపల్‌ డంప్‌ యార్డు వద్ద గత నెల 31వ తేదీన బాంబు పేలుళ్ల జరిగాయి. ఈ ఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు బృందం సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. పేలుడు ఘటనలో కర్నూలు బుధవారపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన సంగతి తెలిసిందే. కర్నూలు డీఎస్పీ యుగంధర్‌ బాబు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం సభ్యులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నప్పటికీ ఆధారాలు లభించకపోవడంతో ఇప్పటివరకు కేసు కొలిక్కి రాలేదు. బాంబులెలా వచ్చాయి... టార్గెట్‌ ఎవరు... ఎవరు దాచారు.. ఎప్పుడు దాచారు... ఎందుకు దాచారు... కుట్రదారులెవరు... పాత్రధారులెవరు అనే కోణంలో దర్యాప్తు కొనసా...గుతూనే ఉంది. సంఘటన జరిగిన సమీపంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ డంప్‌ యార్డును బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలతో జల్లెడ పట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డంప్‌ యార్డు ఇప్పటికీ నిషేధిత ప్రాంతంగానే కొనసాగుతోంది.

దర్యాప్తు కోసం ఐడీ పార్టీలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతమంతా గాలించారు, శోధించారు.. అయినా ఇప్పటివరకు ఒక్క ఆధారమూ లభించలేదు. బాంబు పేలుడు జరిగిన ప్రదేశాన్ని గూగుల్‌ మ్యాప్‌లో నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలిస్తూ కేసు ఛేదన కోసం శ్రమించారు. పేలుడు సంఘటన జరిగిన ప్రదేశం నుంచి ఎక్కువ సమయం ఏ ఫోన్లకు కాల్స్‌ వెళ్లాయనే కోణంలో ఫ్యాక్షనిస్టుల అనుచరులు, పాత నేరస్తుల ఫోన్‌ నంబర్లపై నిఘా ఉంచి దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు ముందు వారం రోజుల నుంచి ఆ ప్రదేశంలో ఎక్కువ సమయం మాట్లాడిన ఫోన్‌ నంబర్ల వివరాలను కూడా సేకరించారు.

సమీపం లోని మద్యం దుకాణాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించినా ఒక్క ఆధారమూ ఇప్పటివరకు లభించలేదు. గత మూడు సంవత్సరాల కాలంలో జరిగిన హత్య కేసుల్లోని నిందితులను, బాంబు తయారీదారులను, పాత నేరస్తులను సుమారుగా 30 మందికి పైగా విడతల వారీగా అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రధానంగా నందికొట్కూరు, డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లో ఉన్న ఫ్యాక్షనిస్టుల అనుచరులపై నిఘా ఉంచి కేసు మిస్టరీని ఛేదించేందుకు శ్రమించినా ఇప్పటివరకు ఒక్క ఆధారం లభించలేదు.
 
నేరాలూ అధికమే... 
జిల్లా కేంద్రం కర్నూలుతో పాటు ముఖ్య పట్టణాల్లో నేరాలు, మోసాలు కూడా అధికమే. పేకాట, క్రికెట్‌ బెట్టింగ్, దొంగతనాలు, మోసాలు, బెదిరింపులు, దొమ్మీలు వంటివి జిల్లాలో సర్వసాధారణమయ్యాయి. నకిలీ నోట్ల చెలామణి, నకిలీ ధృవీకరణ పత్రాల తయారీ, ఆర్థిక నేరాలు షరా మామూలే. ఒంటరిగా జీవనం సాగించే వారిపై జరుగుతున్న నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కర్నూలు నగరంలోని లక్ష్మీనగర్‌లో ఓ వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తుండగా ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, నగదు కోసం దారుణంగా హత్య చేసిన సంఘటన రెండేళ్ల క్రితం సంచలనంగా మారింది. ఇలాంటి తరహా కేసులు ఒకటీ రెండు పోలీసులు ఛేదిస్తున్నప్పటికీ వారి కృషి ఎక్కువ కేసుల్లో ఫలితాలను సాధించలేకపోతోంది. సాంకేతిక ప రిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా కేసుల్లో ఆధారాలు లేక మగ్గుతున్న పరిస్థితులపై ఎస్పీ గోపీనాథ్‌ జట్టి ప్రత్యేక దృష్టి సారించి మనోధైర్యాన్ని నింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
 

అదృశ్యమై ఏడాది గడిచినా ఆచూకీ లేదు...  
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఉమా మహేశ్వరరెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గణాంకాధికారిగా పనిచేస్తూ గత ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీన అదృశ్యమయ్యాడు. అప్పటి డీఎంహెచ్‌ఓ నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 2017 ఆగస్టు మాసంలో ఈయన కడప నుంచి కర్నూలు డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న శ్రీనివాస లాడ్జిలోని 306 రూమ్‌లో ఉంటూ విధులు నిర్వహించేవాడు. సెప్టెంబర్‌ 14వ తేదీ రాత్రి వరకు కార్యాలయంలో విధులు నిర్వహించాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భార్య అనూష ఫోన్‌ చేస్తే సెల్‌ స్విచాఫ్‌ అని వచ్చింది. ఇదే విషయంపై ఆమె కార్యాలయంలోని ఉద్యోగులతో వాకబు చేసినా వారి నుంచి కూడా అదే సమాధానం వచ్చింది.

దీంతో కార్యాలయ ఉన్నతాధికారి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీమ జిల్లాల్లో గుర్తు తెలియని మృతదేహాల కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా అనే కోణంలో మొదట పోలీసులు విచారించారు. తన భర్తను ఎవరో కిడ్నాప్‌ చేసి హత్య చేశారన్న అనుమానంపై భార్య అనూష జిల్లా కలెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు మిస్టరీ వీడలేదు. ఇలాంటి తరహా కేసులు జిల్లాలో వందకు పైగా దర్యాప్తులోనే మగ్గుతున్నాయి.

1/1

2016 జూన్‌లో సి.బెళగల్‌ వద్ద వ్యక్తిని హత్య చేసి పెట్రోల్‌ పోసి తగులబెట్టిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అప్పటి సీఐ డేగల ప్రభాకర్‌ (ఫైల్‌ )

Advertisement
Advertisement