జూ నుంచి తప్పించుకున్న క్రూర మృగాలు

2 Lions 2 Tigers And Jaguar Escape From German Zoo  - Sakshi

బెర్లిన్‌: జూ నుంచి అయిదు క్రూర మృగాలు తప్పించుకున్నాయి. ఈ సంఘటన పశ్చిమ జర్మనీలోని లూనెబాక్‌ నగరంలోని ఐఫెల్‌ జూలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచారం పోలీసులకు తెలియడంతో ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. జూ నుంచి తప్పించుకున్న వాటిలో రెండు సింహాలు, రెండు పులులు, ఒక జాగ్వార్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి సంభవించిన వరద కారణంగా క్రూర మృగాల సంరక్షణ కేంద్రంలోని ఇనుప కంచెలు విరిగిపోయాయని, ఇదే అదనుగా భావించి అవి తప్పించుకున్నాయని జర్మన్‌ మీడియా తెలిపింది.

తప్పించుకున్న వాటిలో ఓ ఎలుగు బంటి కూడా ఉంది. అయితే అధికారులు ముందే అప్రమత్తమై దానిని కాల్చి చంపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జంతువులేవైనా కనబడితే సమాచారం అందించాలని కోరారు.  అయితే ఎన్ని జంతువులు తప్పించుకున్నాయనే దానిపై అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పశువైద్యులు జూలో గాలింపు చర్యలు చేపట్టారు.

74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జూలో సైబీరియన్‌ పులులు, సింహాలతో పాటు 60 రకాలైన సుమారు 400 జంతువులు ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం తూర్పు జర్మనీలోని లీప్‌జిగ్‌లోని ఓ జూలో రెండు సింహాలు తప్పించుకోవడంతో అధికారులు ఒక దానిని కాల్చిచంపారు. మరో సింహాన్ని మత్తు ఇచ్చి సజీవంగా పట్టుకోగలిగారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top