ఉద్యోగం ఊడేలా ఉందా? ఇలా చేయండి..!

steps to help you stay prepared in case of a job loss - Sakshi

సంక్షోభ సమయం సాఫీగా గడిచేందుకు సూచనలు

కరోనా కత్తి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులపై వేలాడుతోంది. మందగమన ప్రభావం వేగంగా వ్యాపించడంతో అన్ని రంగాల్లో ఉద్యోగ భద్రత కరువైంది. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగాల కోతకు దిగాయి. దీంతో మధ్యతరగతి బతుకు ఇబ్బందుల్లో పడుతోంది. ఈ సంక్షోభం ఎంతవరకు ఉంటుందో? తర్వాతైన వెంటనే ఉపాధి దొరుకుంతుందో? లేదో?నని ప్రతి వేతన జీవి మధనపడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఉద్యోగి ఉపాధి కోల్పోతే ఏం చేయాలనే విషయమై ఆలోచించిఉంచుకోవాలని, ఒక్కమారుగా రోడ్డునపడి అయోమయానికి గురికాకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉపాధి కోల్పోయే అవకాశం ఉందనుకొని ప్రతి ఉద్యోగి కొన్ని ప్లాన్స్‌ సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని భావించేవాళ్లు ఈ కింద చర్యలను పాటించి జాగ్రత్త వహించవచ్చని చెబుతున్నారు.
1. వ్యయాల వర్గీకరణ: రెండు నెలలుగా కుటుంబ వ్యయాలు కొంతమేర తగ్గి ఉంటాయి. దీంతో ప్రతినెలా మనం పెడుతున్న అనవసర వ్యయాలను గుర్తించే ఉంటారు. అందువల్ల ఇకపై నెలవారీ వ్యయాలను కేటగిరీలుగా వర్గీకరించుకోవాలి.

ఉదాహరణకు స్థిర వ్యయాలు(అద్దె, స్కూలు ఫీజులు, ఇంటి నిర్వహణ తదితరాలు), తప్పని వ్యయాలు(ఆహారం, అవసరాలు, మందులు, పెట్రోల్‌లాంటివి), అదనపు వ్యయాలు(ఎంటర్‌టైన్‌మెంట్‌, షాపింగ్‌ తదితరాలు)గా విభజించుకొని వీటిలో అదనపు వ్యయాల్లాంటివాటిని నిర్ధాక్షణ్యంగా కట్‌ చేయాలి. 
2. ఆపత్కాల నిధి ఏర్పాటు: ఇప్పటినుంచైనా ప్రతినెలా కొంత మొత్తాన్ని ఆపత్కాల నిర్వహణకు పక్కనపెట్టాలి. ఎలాంటి అవసరానికైనా ఈ మొత్తం ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి.

నిధి పరిణామాన్ని మన ఆదాయాన్ని బట్టి నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక్కరే ఉద్యోగం చేసే ఇంట్లో ఆరు నెలల ఖర్చులకు సరిపడ మొత్తాన్ని, ఇద్దరు ఉద్యోగులుంటే 9 నెలలకు సరిపడ మొత్తాన్ని ఆపత్కాల నిధిగా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు వీలైతే మెడికల్‌ ఫండ్‌ విడిగా ఏర్పరుచుకోవాలి. మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ ఉన్నా, విడిగా మరో మొత్తం వైద్యావసరాలకు పక్కన పెట్టడం మంచిది.
3. అప్పుల కుప్ప కరిగించడం: ముందుగా కుటుంబానికి ఉన్న మొత్తం అప్పులు లెక్కించి వీటిలో అధిక వడ్డీలు కడుతున్నవాటిని వీలయినంత త్వరగా వదిలించుకోవాలి. దీంతోపాటు పర్సనల్‌ లోన్లు, క్రెడిట్‌కార్డు రుణాలను తీర్చేయడం మంచిది.

దీర్ఘకాలిక ఈఎంఐలు ఉండే హౌస్‌లోన్‌ లాంటివి కొనసాగించవచ్చు. అప్పులు తీర్చేందుకు వీలుంటే ఏదో ఒక స్థిరాస్తి విక్రయించైనా బయటపడడం ఉత్తమం. ఆర్‌బీఐ అనుమతిచ్చిందని అనవసరంగా మారిటోరియం ఆప్షన్‌ ఎంచుకోవద్దు. తప్పని పరిస్థితుల్లోనే ఈ ఆప్షన్‌ను పరిశీలించాలి.
4. బీమా- ధీమా: ఆపదలో ఆదుకునే ఇన్స్యూరెన్స్‌ పథకాలను కొనసాగించాలి. ముఖ్యంగా లైఫ్‌, హెల్త్‌ బీమాలను ఆపకపోవడం చాలా అవసరం.

వాహన ఇన్య్సూరెన్స్‌లను కూడా డిఫాల్ట్‌కాకుండా చెల్లించడం ఉపయుక్తంగా ఉంటుంది. 
5. నమోషీ వద్దు: అనుకోకుండా ఉద్యోగం కోల్పోవడం మీ తప్పు కాదని గ్రహించండి. ఇందుకు నామోషీగా ఫీల్‌కానక్కర్లేదు. అలాంటిది జరిగితే కుటుంబ సభ్యులకు పరిస్థితి కూలంకషంగా వివరించండి.

ఈ ఇబ్బంది నుంచి బయటపడేందుకు మీరు చేపట్టిన ప్రణాళికలు చెప్పి, వారి నుంచి అవసర సలహాలు స్వీకరించండి. 
6. అదనపు నైపుణ్యాలు: పరిస్థితుల కారణంగా ఉద్యోగం పోతే దిగులుపడుతూ కూర్చునే బదులు కొత్త ఉద్యోగం దొరికేవరకు అదనపు నైపుణ్యాలు సంపాదించుకోవడం మంచిది.

ఇలాంటి సమయాల్లో కొత్త కోర్సులు లేదా కొత్త భాష నేర్చుకోవడం, కొత్త వ్యాపార రహస్యాలు(ఉదాహరణకు స్టాక్‌మార్కెట్‌) అధ్యయనం చేయడం, శారీరక ఆరోగ్యాన్ని సముపార్జించడం(దుర్వ్యసనాలు మానుకోవడం, ఫిట్‌నెస్‌ సాధించడం) ద్వారా డిప్రెషన్‌కు గురికాకుండా ఉండొచ్చు.
అనుకోని అవాతరం ఎదురైనప్పుడు మనం ఎంత తొందరగా పాజిటివ్‌గా స్పందిస్తామనేదాన్ని బట్టి మన భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అందువల్ల గతం తలచి వగచే కన్నా భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే యత్నాలు చేయడం శ్రేయస్కరమని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సంక్షోభాన్ని సరికొత్త అవకాశంగా భావించేవాడే విజేతగా నిలుస్తాడు.

‘‘ సరైన సంక్షోభాన్ని చేజారనీయకండి’’- విన్‌స్టన్‌ చర్చిల్‌.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top