జీఎస్టీలో మార్పులు?

some changes in GST - Sakshi

60 వస్తువులపై పన్ను తగ్గింపు!

శ్లాబుల్లో మార్పుచేర్పులకు అవకాశం

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊరట కల్పించే చాన్స్‌

నేటి జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో నిర్ణయం?

అమిత్‌ షా, జైట్లీతో మోదీ అత్యవసర భేటీ

సాక్షి, న్యూఢిల్లీ:  
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) శ్లాబుల్లో మార్పుచేర్పులు చోటు చేసుకోనున్నాయా..? 60 వస్తువులపై పన్నులు తగ్గించబోతున్నారా? చిన్న, మధ్యతరహా పరిశ్రమలతోపాటు వస్త్ర పరిశ్రమకు కూడా ఊరట కల్పించే దిశగా కేంద్రం యోచిస్తోందా..? తాజా పరిణామాలు గమనిస్తే వీటన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. వివిధ వర్గాలకు దీపావళి కానుకగా శుక్రవారం ఢిల్లీలో జరగబోయే 22వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. గురువారం ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో అత్యవసరంగా సమావేశమై మూడు గంటలపాటు ఈ అంశాలపై చర్చించినట్లు సమాచారం. జీఎస్టీ అమలుతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించాల్సిందిగా అధికారులను కోరాననీ, వాటిని త్వరలోనే సరిదిద్దుతామని ప్రధాని ఇప్పటికే చెప్పారు.

సామాన్యులపై ఎక్కువ భారం పడకుండా జీఎస్టీ శ్లాబులను సవరించే దిశగా మోదీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పెద్దనోట్ల రద్దుతో కుంగిపోయిన చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలని అటు ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కూడా కోరుతున్నారు. అలాగే గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో మోదీ గుజరాత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగబోయే జీఎస్టీ మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్టీలో ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం పన్ను శ్లాబులు ఉన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు, పారిశ్రామివేత్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు అనుగుణంగా వీటిలో మార్పుచేర్పులు చేయనున్నట్టు సమాచారం. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, కనీస వేతనాలు, గుజరాత్‌ పర్యటన తదితర అంశాలపై కూడా ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో చర్చించినట్టు తెలిసింది.

పన్ను తగ్గింపు ఏ వస్తువులపై?
ప్రస్తుతం 28 శాతం పన్ను శ్లాబుల్లో ఉన్న దాదాపు 60 వస్తువులపై పన్ను తగ్గించే అవకాశం ఉన్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే 18 శాతం పన్ను శ్లాబులో ఉన్న వస్తువులు, సేవలను 12 శాతం శ్లాబులోకి మార్చే అవకాశాలున్నట్టు వివరించారు. పన్నులు తగ్గిస్తే దీపావళి పండుగ ముంగిట వినియోగదారులకు ఊరట కల్గించినట్టవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

కేరళ నుంచి హుటాహుటిన షా
మోదీతో సమావేశానికి అమిత్‌ షా కేరళ నుంచి హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వస్థలం మీదుగా బీజేపీ గురువారం జనరక్ష యాత్రను నిర్వహించింది. ఈ యాత్రలో షా పాల్గొనాల్సి ఉంది. కానీ మోదీతో భేటీ పర్యటనను రద్దు చేసుకొని ఢిల్లీ చేరుకున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top